అనంత బ్రదర్స్ కు దారెటు..?
అనంతపురం, జూన్ 30
రాజకీయాలు అందరికీ నప్పుతాయా? అంటే చెప్పలేం. వారసులుగా వచ్చిన వచ్చి జగన్ రేంజ్‌లో గెలుపు గుర్రం ఎక్కి అధికారంలో కి వచ్చిన నాయకులు ఏపీలో అసలు ఎవరూ లేరు. పోనీ..ఇంత కాకపోయినా.. కొంతైనా సాధించిన వారసులు ఉన్నారా ? అంటే.. అది కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఒకే సభలో తండ్రీ తనయులు కనిపించిన సందర్భం మన అసెంబ్లీలో ఎప్పుడూ లేదు. ఇదిలావుంటే, రాజకీయాలకు వారసులుగా వచ్చిన వారు గత ఏడాది ఎన్నికల్లో చాలా మంది కనిపించారు. తండ్రుల హవాతో రాజకీయాల్లో ఎదగాలని బలంగా నిర్ణయించుకుని రంగంలోకి దిగిన నాయకులు ఉన్నారు. అయితే, ఇలాంటి వారిలో ఎవరూ విజయం సాధించక పోవడం గమనార్హం. వైసీపీ నుంచి పోటీ చేసిన వారిలో నంద్యాలలో శిల్పా , ఆళ్లగడ్డలో గంగుల వారసులను మినహాయిస్తే టీడీపీలో రాజకీయ భవిష్యత్తు వెతుక్కుందామని వచ్చిన వారంతా చిత్తుగా ఓడిపోయారు. మరీ ముఖ్యంగా.. అనంతపురం జిల్లా నుంచి తండ్రి చాటు నేతలుగా రాజకీయాల్లోకి వచ్చిన వారు కూడా ఫలితం దక్కించుకోలేక పోయారు. ఉదాహరణకు జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్ రెడ్డి సోదరులనే తీసుకుంటే.. వీరు సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. మరీ ముఖ్యంగా దివాకర్ రెడ్డి నాలుగు దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్నారు. అంతేకాదు. ఇప్పటి వరకు ఓటమి అన్నది ఎరుగని నాయకుడుగా దివాకర్ రెడ్డి పేరు తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌లో తాడిపత్రి నియోజకవర్గం నుంచి వరుసగా ఏడు సార్లు ఈ కుటుంబమే గెలిచి గుర్రమెక్కింది. పార్టీలు మారినా.. ప్రజలతో జై కొట్టించుకున్న చరిత్రను సైతం సొంతం చేసుకున్నారు. 2014 రాష్ట్ర విభజన నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో జేసీ కుటుంబం కాంగ్రెస్‌ను వీడి సైకిల్ ఎక్కినా, అనంతపురం ఎంపీ సహా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గాలను తమ ఖాతాలో వేసుకున్నారు. ఇలా పార్టీలతో సంబంధం లేకుండా తమ హవాను ప్రదర్శించారు.అయితే, ఇంతకాలం రాజకీయాల్లో ఉన్నాం కదా.. అనుకున్నారో.. లేదా వారసులకు అవకాశం ఇచ్చి.. తాము మురిసిపోదామని భావించారో ఏమో.. ఇద్దరు సోదరులు గత ఏడాది ఎన్నికల సమయంలో తాము పోటీ నుంచి తప్పుకొని తమ వారసులను రంగంలోకి దింపారు. ఈ క్రమంలోనే జేసీ దివాకర్ కుమారుడు పవన్ కుమార్, ప్రభాకర్ కుమారుడు అస్మిత్ రెడ్డిలు రంగంలోకి దిగారు. అనంతపురం ఎంపీగా పవన్, తాడిపత్రి ఎమ్మెల్యేగా అస్మిత్‌లు పోటీ చేశారు. నిజానికి వీరికి జిల్లాలో మంచి పేరే ఉంది. ట్రావెల్స్ వ్యాపారంలో అస్మిత్.. ఇతర వ్యాపారాలు సహా క్రికెట్ అసియేషన్ అధ్యక్షుడుగా పవన్‌కు మంచి పేరుంది. అంతేకా దు… జిల్లాలో వీరి పలుకుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు అన్నదమ్ములు కూడా గెలుపు గుర్రాలు ఎక్కడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే, అనూహ్యంగా జగన్ సునామీ ముందు ఈ ఇద్దరు ఓడిపోయారు.ఇప్పుడు ఏడాది దాటిపోయింది. మరి ఏమైనా పుంజుకున్నారా? వచ్చే ఎన్నికల నాటికి పునాదులను బలోపేతం చేసుకున్నారా? అంటే.. వ్యక్తిగతంగా ఏమాటకామాట చెప్పుకోవాలంటే.. పవన్, అస్మిత్‌లు ఇద్దరూ కూడా తండ్రులు చేసింది చెప్పుకొనేందుకు మాత్రమే పరిమితమయ్యారు. ఈ ఏడాది కాలంలో నియోజకవర్గంలో పర్యటించింది లేదు.. ప్రజలను పట్టించుకున్నదీ లేదు. పార్టీ తరఫున కార్యక్రమాలు చేసింది కూడా లేదు. కేవలం గతంలో తమ తండ్రులు వేసిన పునాదులే.. తమకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. పవన్ పూర్తిగా హైదరాబాద్, బెంగళూరుకే పరిమితమవుతున్నారన్న టాక్ వచ్చేసింది.ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం తాడిపత్రి మునిసిపల్ ఎన్నికల్లో వార్డు కౌన్సెలర్‌గా పోటీలో ఉన్నారు. ఇక పవన్ కుమార్ రెడ్డికి అటు టీడీపీ మాజీ నేతలతో పడడం లేదు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో తన అనుచరులకు కనీసం ఐదు కార్పొరేటర్ సీట్లు ఇవ్వమని వేడుకున్నా కూడా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. జేసీ అస్మిత్‌రెడ్డికి అసలు టీడీపీలో ఉండడమే ఇష్టం లేదని అంటున్నారు. పవన్ టీడీపీలో ఉండాలా ? వద్దా ? అన్న ఊగిసలాటలో ఉన్నా అస్మిత్‌కు మాత్రం ఇక్కడ ఉండడం సుతరామూ ఇష్టం లేదట. ఏదేమైనా మూడు దశాబ్దాలుగా పైగా అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీ వేసుకున్న పునాదులు వైసీపీ దూకుడు ముందు కదిలిపోతున్నాయని అంటున్నారు పరిశీలకులు. దీంతో తమకంటూ.. ప్రత్యేకత ను చూపించుకోలేకపోతే.. జేసీ కుటుంబం కష్టాలు చవిచూడక తప్పదని అంటున్నారు పరిశీలకులు.