మంకీ గేట్ వివాదంలో నోరైనా విప్పి నిజం చెప్పలేదు.. మ్యాచ్ రెఫరీ మైక్ ప్రోక్టర్
మంకీగేట్ వివాదం ఎంత క్రికెట్ ప్రపంచంలో ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2008 ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీ టెస్టులో (సిరీస్‌లో రెండోది) ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ఆండ్రూ సైమండ్స్‌ను భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ‘మంకీ’ అని సంబోధించాడంటూ ఆస్ట్రేలియా క్రికెట్ టీం ఆరోపించింది. దీనిపై వాదనలూ జరిగాయి. హర్భజన్‌పై మూడు మ్యాచ్‌ల నిషేధమూ పడింది. ఆ వివాదం జరిగిపోయి దశాబ్దం గడచిపోయినా ఇప్పటికీ అది తాజా వివాదంలాగే కనిపిస్తుంటుంది. అయితే, తాజాగా ఆ వివాదంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తీరు సరిగ్గా లేదని ఆ మ్యాచ్కు రిఫరీగా వ్యవహరించిన మైక్ ప్రోక్టర్ ఆరోపించాడు. తన జీవిత చరిత్రలో ఆ వివాదానికి సంబంధించిన ఇతివృత్తాన్ని పేర్కొన్నాడు.
‘‘సచిన్ నిజం చెప్పకపోవడం అసంతృప్తి కలిగించింది. హర్భజన్ సింగ్ మంకీ అనలేదని ‘మా కీ..’ అని మాత్రమే సంబోధించాడని సచిన్ చెప్పి ఉంటే కథ వేరేగా ఉండేది. ఆ మాట తాను విన్నానని అని ఉంటే హర్భజన్‌పై జాతి వివక్ష మచ్చ పడి ఉండేది కాదు. కానీ, ఆ సమయంలో సచిన్ నోరు విప్పి నిజం చెప్పలేదు’’ అని ప్రోక్టర్ తన పుస్తకంలో వెల్లడించాడు. ‘మంకీ’, ‘మా కీ..’ అనే పదాల ఉచ్ఛరణ దాదాపు ఒకేలా ఉన్నాయని, ఆ మాట 22 గజాల వరకూ ఉన్న ఆటగాళ్ల చెవిలో పడిందని అన్నాడు. సచిన్ మాత్రం ఈ మొత్తం వ్యవహారంపై కనీసం నోరైనా విప్పలేదని, అతడు ఏమీ చెప్పకపోవడంతో తనకు వేరే అవకాశమే లేకుండా పోయిందని ప్రోక్టర్ చెప్పాడు. హర్భజన్ తనలాగే మంచి ఇంగ్లిష్ మాట్లాడగలడని, కాబట్టే ఐసీసీ అందించాలనుకున్న న్యాయ సహాయాన్ని అతడు తిరస్కరించాడని చెప్పాడు. ఇక, ఈ వ్యవహారంలో ఆ నాటి టీమ్ మేనేజర్ చేతన్ చౌహాన్ కూడా సరైన వాదనలు వినిపించలేదని, తద్వారా తాను ఎటూ తేల్చుకోలేకపోయానని వివరించాడు.