యాప్‌ల బ్యాన్ నిర్ణయంపై చైనాతీవ్ర ఆందోళన
బీజింగ్ జూన్ 30
టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, షేర్ ఇట్, హెలో, వైబో, డియూ క్లీనర్, డియూ బ్రౌజర్ తదితర యాప్‌లను భారత్ బ్యాన్ చేయడంపై చైనా స్పందించింది. భారత్ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాము పరిస్థితిని గమనిస్తున్నామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావ్ లిజియాన్ తెలిపారు. యాప్‌లపై నిషేధం భారత్‌కు మేలు చేసేది కాదని చెప్పారు. అంతర్జాతీయ చట్టాలను, స్థానిక చట్టాలను, నిబంధనలకు కట్టుబడి పనిచేయాలని తమ ప్రభుత్వం చైనా వ్యాపారవేత్తలకు నిరంతరం చెబుతూ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.లడక్ గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో 59 చైనా మొబైల్ యాప్‌లను భారత్ నిషేధించింది. జూన్ 15న జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు చనిపోయిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. బలగాల ఉపసంహరణ సమయంలో చైనా సైనికులు కుట్రపూరితంగా వ్యవహరించి 20 మంది భారత జవాన్లను పొట్టనపెట్టుకున్నారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి రెండు దేశాలూ యత్నిస్తున్నాయి. నేడు కూడా కమాండర్ల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఎల్‌ఏసీ వెంబడి చైనా తన బలగాలను పెంచుతూ పోతోంది. దీంతో భారత్ కూడా ఎల్‌ఏసీ వెంబడి తన జవాన్లను పెద్దసంఖ్యలో మోహరిస్తోంది. మొత్తం ఎల్‌ఏసీ వెంబడి 3,500 కిలోమీటర్ల వరకూ విమానాలు, హెలికాఫ్టర్ల ద్వారా భారత్ నిఘా ఉధృతం చేసింది.