YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

దారి కావాలి

దారి కావాలి

నల్గొండ జిల్లాలోని పడమటి తండాకు సరైన రహదారి లేదు. దీంతో గ్రామస్థులు ఇతర ప్రాంతాలకు వచ్చేందుకు నానాపాట్లు పడుతున్నారు. పెద్దఅడిశర్లపల్లి మండలంలోని వద్దిపట్ల గ్రామపంచాయతీకి కిలోమీటరు దూరంలో పడమటితండా ఉంది. ఈ ఊళ్లో వెయ్యికిపైగా జనాభా నివసిస్తోంది. వెయ్యికిపైగా జనాభా ఉండటంతో వద్దిపట్ల పంచాయతీ ఎన్నికల్లో ఈ ప్రాంతం కీలకపాత్ర పోషిస్తోంది. ఇటీవల గ్రామపంచాయతీల పునర్విభజనలో ప్రత్యేక గ్రామపంచాయతీగా ఏర్పడింది. దీంతో పడమటి తండా రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ గ్రామం కీలకం అయినా స్థానికంగా మాత్రం కనీస వసతులు కరవయ్యాయి. ప్రధానంగా పక్కా రహదారి లేదు. దీంతో ప్రజలు రాకపోకలకు నానాపాట్లు పడుతున్నారు. వర్షాకాలమైతే ఇక్కణ్ణుంచి రాకపోకలు సాగించేందుకు నరకం అనుభవిస్తారు. ఏఎమ్మార్‌ ప్రాజెక్టు రావడంతో ఇతర ప్రాంతాలకు నీటి సౌకర్యం మెరుగైనా పడమటి తండాకు మాత్రం సమస్యలు తెచ్చిపెట్టింది. 

ప్రాజెక్టు లేనప్పుడు తండాకు తూర్పువెపు నుంచి వ్యవసాయ పొలాల్లోని డొంకదారిని ప్రజలు వినియోగించుకునేవారు. అప్పటి వరకూ ఈ గ్రామంలో నీటిప్రమాదాలు లేవు. పదిహేనేళ్ల క్రితం తండాకు సమీపంలోనే పుట్టంగండి వద్ద ఏఎమ్మార్పీ ఎత్తిపోతల పథకం రూపుదిద్దుకోవడంతో సమస్యలు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టు ప్రధాన కాల్వ పర్యవేక్షణకు కాల్వను ఆనుకుని ప్రాజెక్టు నిధులతో నిర్మించిన రహదారే వీరికి దిక్కయ్యింది. ఏళ్లుగా రహదారి కష్టాలు తీర్చిన ఈ కాల్వ రోడ్డే తండావాసుల పాలిట మృత్యుమార్గంగా మారింది. కాల్వగట్టుపై తక్కువ వెడల్పుతో రోడ్డు నిర్మించారు. ఈ దారికి రక్షణ గోడ లేదు. దీనికితోడు నిరంతర నీటి ప్రవాహానికి కాల్వ సుమారు మూడు మీటర్లమేర కోతకు గురైంది. ఫలితంగా వాహనాలు ప్రయాణించలేని దుస్థితి. ఈ రహదారిపై రోజూ పాఠశాల బస్సులు, ఇతర వాహనాల్లో ప్రజలు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి పడమటి తండాకు మంచి రహదారి ఏర్పాటు చేయాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని అంతా కోరుతున్నారు.

Related Posts