హైదరాబాద్ జులై 01, దేశంలోని ఏ కంటోన్మెంట్ లో లేని విధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ల ఆదేశాల మేరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బుధవారం సికింద్రాబాద్ బోర్డ్ కార్యాలయంలో మంత్రి అద్యక్షతన కంటోన్మెంట్ లోని సమస్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కార్మిక శాఖామంత్రి మల్లారెడ్డి, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, వాటర్ వర్క్స్ ఈడీ సత్యనారాయణ, కంటోన్మెంట్ సీఈవోలు అజిత్ రెడ్డి, చంద్రశేఖర్, బోర్డ్ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ గతంలో అనేక సమస్యలతో కంటోన్మెంట్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో దశల వారిగా సమస్యలను పరిష్కరిస్తున్నట్లు వివరించారు. త్రాగునీరు 10 రోజులకు ఒకసారి సరఫరా జరిగేదని, కాని ఇప్పుడు సక్రమంగా సరఫరా జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం సరఫరా చేస్తున్న 50 వేల గ్యాలన్ల నీరు సరిపోవడం లేదని స్థానిక ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు త్వరలోనే నీటి సరఫరా ను పెంచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను కంటోన్మెంట్ లోని బోయిన్ పల్లి, లాల్ బజార్ తదితర ప్రాంతాలలో నివసిస్తున్న అర్హులైన పేదలు అందరికి వర్తింప చేస్తున్నామని, ఈ ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. రామన్న చెరువు అభివృద్ధి కోసం ప్రభుత్వం 3 కోట్ల రూపాయలను మంజూరు చేసి పనులు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. అదేవిధంగా ప్యాట్నీ, పికెట్ నాలా లలో సిల్ట్ తొలగింపు, అభివృద్ధి పనులకోసం 48 లక్షల రూపాయలు మంజూరైనాయని, త్వరలోనే పనులు చేపట్టడం జరుగుతుందని మంత్రి యాదవ్ తెలిపారు. కంటోన్మెంట్ లో చేపట్టవలసిన పనులపై కంటోన్మెంట్ అధికారులు, బోర్డు సభ్యుల సమన్వయంతో ప్రణాళికలను రూపొందించి అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. కంటోన్మెంట్ కు ప్రభుత్వం నుండి వివిధ శాఖల ద్వారా పెండింగ్ లో ఉన్న నిధుల మంజూరు కోసం గురువారం నాడు ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ T.హరీష్ రావును కలిసి నివేదించనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా కంటోన్మెంట్ లోని పలు సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే మున్సిపల్ శాఖ మంత్రి సమక్షంలో ఒక సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.