తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగించి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సర్కార్ స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ అక్రమార్కుల్లో మార్పు రావడంలేదు. అధికార యంత్రాంగం ఉదాసీనతను క్యాష్ చేసుకుంటూ పలువురు రూ.కోట్లు దండుకుంటున్నారు. ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. ఈ దందా జోరందుకోవడంతో ప్రభుత్వం సీరియస్ అవుతోంది. అక్రమాలకు తెరదించేందుకు నడుంబిగించింది. ఈ నేపథ్యంలోనే శాండ్ టాక్సీ విధానాన్ని అమలులోకి తీసుకొస్తోంది. ఇసుక అక్రమ రవాణాకు పూర్తిగా చెక్ పెట్టే బాధ్యతను తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పేరేషన్ తీసుకుంది. టీఎస్‌యండీసీనీ బోల్తా కొట్టిస్తూ పలువురు ఇసుక అక్రమాలు కొనసాగించారు. దీంతో సర్కార్ శాండ్ టాక్సీ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది.
స్థానిక అవసరాలను పరిగణించి ఇసుక అవసరమైనవారికి తక్కువ ధరకు అందించాలన్నదే శాండ్ టాక్సీ విధానంలోని ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ పద్ధతిని అమలు చేస్తూ ఇసుకాసురులకు బ్రేక్ వేస్తున్నారు. కరీంనగర్ ప్రాంతంలోనూ ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రత్యేక వెబ్‌సైట్, సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. నోడల్ అధికారి ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ పనిచేయనుంది. ఇదిలాఉంటే ఇసుక రవాణా చేయాలనుకున్న ట్రాక్టర్ల యజమానులు తమ వాహనాల నంబర్లను సంబంధిత వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఇందుకు వాహన యజమాని కొంత సొమ్మును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇసుక అవసరమైన వారు ఫోన్ లేదా వెబ్‌సైట్‌లో ద్వారా ఎన్ని ట్రిప్పుల ఇసుక అవసరమో బుక్ చేసుకోవాలి. ఆ సమాచారం రిజిస్టర్ అయిన ట్రాక్టరు యజమానులకు వెళ్తుంది. గుర్తించిన ఇసుక క్వారీ నుంచి అవసరమైన ఇసుకను తరలిస్తారు. ఆ సమాచారం బుక్ చేసుకున్న వారికి చేరుతుంది. లోడింగ్ సీనరేజ్ రుసుం, రవాణాతో కలిపి ట్రిప్పు ధర నిర్ణయిస్తారు. ఇక ఇసుక లోడ్‌తో వెళ్తున్న వాహనాల గమనాన్ని పరిశీలించేందుకూ ఏర్పాట్లు ఉంటాయి. జీపీఎస్ పరికరాల ద్వారా వాహనం ఎక్కడున్నదీ ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. ఇసుక అక్రమ రవాణా అయినట్లు తేలితే సదరు వాహనం యజమాని చెల్లించిన డిపాజిట్ సొమ్మును జప్తు చేస్తారు. స్థానికంగా విజృంభిస్తున్న ఇసుక అక్రమార్కులకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలపై కరీంనగర్ వాసులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.