YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తాగునీటి కోసం తంటాలు

తాగునీటి కోసం తంటాలు

ఎండలు ముదిరిపోతుండడంతో నిర్మల్ జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఉష్ణతాపంతో అల్లాడిపోతున్నారు. టెంపరేచర్లు 32డిగ్రీలు దాటిపోతుండడంతో బయటకు రావాలంటేనే అంతా భయపడుతున్న పరిస్థితి. ఇదిలాఉంటే.. వేసవి ఎఫెక్ట్ స్థానిక నీటి వనరులపై తీవ్రంగా ఉంది. జిల్లాలో తాగు-సాగు నీటి అవసరాలకు తగ్గట్లుగా నీరు అందుబాటులో లేదు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే తాగునీటి కోసం ప్రజలు నానాపాట్లు పడాల్సి వస్తోంది. కిలోమీటర్ల మేర నడిచి నీటిని తెచ్చుకుంటున్నారు. భూగర్భ జలాలు పాతాళానికి చేరడంతో రైతుల పాట్లు తీవ్రమయ్యాయి. మార్చి నెలలోని ఎండలకే పలు ప్రాంతాల్లో పంటలు ఎండిపోయాయి. ఉన్న కాస్త పంటను రక్షించుకునేందుకు కర్షకులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సకాలంలో పంటలకు నీరు అందించేందుకు ముప్పుతిప్పలు పడుతున్నారు. ఈ పరిస్థితిని పరిశీలిస్తే జిల్లాలో నీటి వనరులు గణనీయంగా క్షీణించిపోయాయని ఈజీగానే చెప్పొచ్చు. ఈ దుస్థితి కేవలం నిర్మల్‌కే పరిమితం కాలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇదే చిత్రం కనిపిస్తోంది. 

ఉమ్మడి జిల్లాలో వేసవిలో తాగు నీటి సమస్య తీవ్రంగా ఉంటోంది. ఈ సమస్యను అధిగమించేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు సరిపోవడంలేదు. దీంతో ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. స్థానికంగా సుమారు రెండు వందలకు పైగా గ్రామాల్లో నీటి ఎద్దడి ఉన్నట్లు అధికారులే గుర్తించారు. మిషన్‌భగీరథ పనులు ఇప్పటికీ కొనసాగుతుండడంతో టార్గెట్ ప్రకారం మంచినీరు అందించలేని పరిస్థితి. మరోవైపు రక్షిత మంచినీటి పథకాలు వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. ఈ సమస్యలకు తోడు అక్కడక్కడా పైప్‌లైన్ల లీకేజీలు సంభవిస్తున్నాయి. పలుచోట్ల మంచినీటిలో మురుగు నీరు కలుస్తోంది. చేసేదేం లేక ఆ నీటినే వినియోగిస్తున్నారు గిరిజనులు. ఇంద్రవెల్లి, నార్నూర్‌  ఉట్నూర్‌, జైనూర్‌, సిర్పూర్‌ ఏజెన్సీలో స్థానికులు కిలోమీటర్ల మేర నడచి పాడుబడ్డ బావులు, కలుషితమైన చెలిమల నీటినే తెచ్చుకుంటున్నారు. ఈ నీటిని సేవిస్తే రోగాలు ముసురుకుంటాయని తెలిసినా మరోమార్గం లేక ప్రజలు ఈ కలుషిత జలాన్నే తాగుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తాగునీటి సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేయాలని అంతా కోరుతున్నారు. ప్రజలకు సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు.  

Related Posts