తిరుపతి, జూలై 2, ప్రపంచం మొత్తాన్ని కరోనా భయం వెంటాడుతోంది. ఎక్కడ చూసినా ఈ మహమ్మారి పంజా విసురుతుండటంతో జనాలు వణికిపోతున్నారు. ఇక కరోనా కాకుండా జనాలు మామూలుగా ఎవరైనా చనిపోతే కరోనా భయంతో వారి అంత్యక్రియలు చేయడానికి నలుగురు ముందుకు రావడం లేదు. బంధుత్వాలు కూడా మర్చిపోయే అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాలోనూ అదే జరిగింది. గుండెపోటుతో 68 ఏళ్ల వృద్ధుడు చనిపోతే అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పోలీసులే ఆప్తులై అంతిమ సంస్కారాలు నిర్వహించారు.చిత్తూరు జిల్లా ఏకాంబర కుప్పంలో రిటైరైన 68ఏళ్ల వృద్ధుడు చిన్న జిరాక్స్ షాపు నడుపుకుంటున్నాడు. మరో గదిలో ఒంటరిగా ఉంటున్నారు. అతడి భార్య చనిపోగా.. కొడుకు, కోడలు పక్క వీధిలో నివాసం ఉంటున్నారు. ప్రైవేటు వాహనాల్లో డ్రైవర్‌గా పనిచేసే కుమారుడికి వారం రోజుల క్రితం కరోనా సోకడంతో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసి తండ్రి మనసు తల్లడిల్లింది.. తన కొడుకుకు ఏమవుతుందోనని కలత చెందాడు. గుండెపోటు రావడంతో చనిపోయాడు. పెద్దాయన చనిపోయిన కొద్దిసేపటికి కుమారుడు కూడా ఆస్పత్రిలో కన్నుమూశాడు.వృద్ధుడి చావు వార్త తెలిసినా కరోనా భయంతో మృతదేహాన్ని చూసేందుకు బంధువులెవరూ రాలేదు. విషయం తెలిసి పోలీసులు మృతదేహానికి అంత్యక్రియలు జరిపించాలని వృద్ధుడి బంధువులకు చెప్పారు. ఎవరూ రాకపోవడంతో పోలీసులే ఆత్మబంధువులయ్యారు.. సీఐ మద్దయ్య ఆచారి సిబ్బందితో కలిసి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. కరోనాతో మరణించిన కుమారుడి మృతదేహం రుయా ఆస్ప త్రిలోనే ఉంచారు. కరోనా మార్గదర్శకాలను అనుసరించి మృతదేహాన్ని ఖననం చేయాల్సి ఉంది