YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

ఆఫీస్ స్పేస్ కు మంచి డిమాండ్

ఆఫీస్ స్పేస్ కు మంచి డిమాండ్

హైద్రాబాద్, జూలై 2, హైదరాబాద్‌తో పాటు పలు మెట్రోనగరాల్లో ఆఫీసు స్పేస్‌కు డిమాండ్ తగ్గింది. దేశ్యవాప్తంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ పేమెంట్స్ సొల్యూషన్స్ సేవలందిస్తున్న కంపెనీలు సైతం మెట్రో నగరాల్లో ఆఫీసు స్పేస్‌ను తగ్గించుకోవాలని నిర్ణయించినట్టుగా ఓ ప్రముఖ సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది. కరోనా యావత్ ప్రపంచానికి కొత్త పాఠం నేర్పింది. ఇప్పటికే పలు మెట్రోనగరాల్లో కార్యాలయాలను తగ్గించే విధంగా ప్రముఖ కంపెనీలు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. కరోనాకు ముందు ఓ వెలుగు వెలిగిన ప్రముఖ రియల్ కంపెనీలతో పాటు ఐటి, ఫైనాన్షియల్ సంస్థలు చేసేదేమీలేక ఖర్చులను తగ్గించుకోవాలన్న ఉద్ధేశ్యంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే ఏయే మెట్రోనగరాల్లో ఎంత ఆఫీసు స్పేస్ ఉంది, ఎంత అద్దె చెల్లిస్తున్నాం, పనిచేస్తున్న సిబ్బంది, అక్కడ వస్తున్న ఆదాయం వివరాలతో పాటు రానున్న రోజుల్లో అక్కడ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై సర్వే నిర్వహించి ఆఫీసులను నిర్వహించే దానిపై తర్జనభర్జన పడుతున్నట్టుగా ఈ అధ్యయనంలో తేలింది.2019లో కార్యాలయాల ఏర్పాటు కోసం 40 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకోవడానికి ప్రముఖ సంస్థలు పోటీపడగా, 2020 సంవత్సరంలో 20 నుంచి 25 మిలియన్ చదరపు అడుగులకు పడిపోయే అవకాశం ఉందని రియల్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక రిటైల్ రంగంలో లీజింగ్ సైతం ఈ ఏడాది 64 శాతం మేర పతనమయ్యే అవకాశం ఉందని, కోవిడ్-19 ప్రభావంతో దేశంలో రెసిడెన్షియల్ రియల్‌ఎస్టేట్‌కు డిమాండ్ పడిపోవడంతో పాటు లిక్విడిటీ సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని వారు ఓ అంచనాకు వచ్చారు.బెంగుళూరు ఆఫీసు స్పేస్ డిమాండ్‌ను మించి హైదరాబాద్‌లో ఆఫీసు స్పేస్‌ను దక్కించుకోవడానికి గతంలో ఎక్కువ మంది పోటీపడేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో మెట్రో నగరాల్లో ఆఫీసు స్పేస్‌లను వదులుకోవడం మంచిదన్న అభిప్రాయాన్ని ఆయా సంస్థల యాజమాన్యాలు ఆలోచిస్తున్నాయి. హైదరాబాద్‌లో ఐటి కంపెనీలు ఎక్కువగా ఉన్నాయి. వీటికి అనుగుణంగా నిర్మాణరంగం సైతం దూసుకుపోతోంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో నిర్మాణరంగం చతికిలబడింది. ప్రస్తుతం ధరలు తగ్గకపోయినా క్రయ, విక్రయాలు ఆగిపోయాయి. హైదరాబాద్ పశ్చిమవైపు ఆఫీసు స్పేస్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో దేశీయ రియల్ ఎస్టేట్ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలు సైతం ఇక్కడ ఆఫీస్ స్పేస్ కోసం ముందస్తు బుకింగ్‌లు చేసుకున్నాయి. ప్రస్తుతం ఐటి ఉద్యోగులందరూ వర్క్ ఫ్రంహోంకు పరిమితంకావడంతో ఆఫీసు స్పేస్‌కు ముందస్తుగా అడ్వాన్స్‌లు ఇచ్చిన వారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.మరో ఆరునెలల వరకు కరోనా భవితవ్యం తేలే పరిస్థితి లేకపోవడంతో ఐటితో పాటు నిర్మాణంరంగంలో పెట్టుబడులు పెట్టిన వారు ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే వర్క్‌ఫ్రం హోం అనేది తాత్కాలికమేని విశ్లేషకులు పేర్కొంటున్నా రానున్న రోజుల్లో కాలమే నిర్ణయిస్తుందని వారు పేర్కొంటున్నారు. అయితే రియల్‌వర్గాలు మాత్రం రానున్న రోజుల్లో రిటైల్, కమర్షియల్ స్పేస్‌లు మరింత డిమాండ్ పెరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.కరోనాకు ముందే జనవరి నుంచి మార్చి మధ్య గృహాల అమ్మకాలు 50 శాతం పడిపోయినట్టుగా హౌజింగ్ బ్రోకరేజ్ అనరాక్ కన్సల్టెన్సీ ఓ నివేదికలో పేర్కొంది. జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో 2,680 నివాస ఆస్తులు మాత్రమే అమ్ముడయ్యాయని తెలిపింది. భారతదేశంలోని మొదటి ఏడు నగరాల్లో గృహ అమ్మకాలు, కొత్త ప్రాజెక్టు ప్రారంభాలు వార్షిక, త్రైమాసిక ఫలితాలు తగ్గాయని అనరాక్ కన్సల్టెన్సీ తన నివేదికలో తెలిపింది.దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో సుమారు 15.62 లక్షలకు పైగా గృహాలు నిర్మాణంలో ఉన్నాయని, ఇవి 2013, 2019 మధ్య కాలంలో ప్రారంభమైన గృహాలేనని తన నివేదికలో తెలిపింది. హైదరాబాద్‌లో 64,250 యూనిట్లు, ఎంఎంఆర్‌లో అత్యధికంగా 4.65 లక్షల గృహాలు, ఎన్‌సిఆర్‌లో 4.25 లక్షలు, పుణేలో 2.62 లక్షలు, బెంగళూరులో 2.02 లక్షలు, కోల్‌కత్తాలో 90,670, చెన్నైలో 54,200 యూనిట్లు ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త గృహాల నిర్మాణాలు ప్రారంభమయ్యేఅవకాశం లేదని రియల్‌రంగం నిపుణులతో పాటు పలు సంస్థలు పేర్కొంటున్నాయి.

Related Posts