అమరావతి జూలై 2, 2020–2023 పారిశ్రామిక విధానంపై సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి గురువారం సమీక్ష జరిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం హాజరు అయ్యారు. పారిశ్రామిక విధానంలో పొందుపరచనున్న అంశాలపై చర్చ, పలు ప్రతిపాదనలపై సీఎంతో అధికారులు చర్చించారు. ఉద్యోగాల కల్పన, ప్రాంతాల మధ్య సమతుల్యత, పర్యావరణ సానుకూల అభివృద్ధిని సాధించడంపై పాలసీ దృష్టి సారిస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు మరింత మెరుగ్గా నడిచేలా చేయడం, అలాగే విదేశీ పెట్టబడులపైనా ఫోకస్ పెడుతున్నామని అధికారులు సీఎం కు తెలిపారు. మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ది రంగాల్లో కీలక చర్యల ద్వారా పారిశ్రామిక ప్రగతికి తోడ్పాటునందించేలా చర్యలు చేపడతాం. పరిశ్రమల స్థాపనలో ఉన్న కాలాన్ని తగ్గించడం, దీని కోసం మౌలిక సదుపాయాల వృద్ధి, వెనుకబడిన వర్గాల సామాజికాభివృద్ధికి ప్రత్యేక చర్యలు, పారిశ్రామిక పాలసీలో భాగంగా ఉన్నాయని అధికారులు పేర్కోన్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వాటి పునరుద్ధరణ, చేయూతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కాలుష్యం వెదజల్లే పరిశ్రమల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పరిశ్రమలకు ప్రోత్సాహం ఎంత ముఖ్యమో వాటి నుంచి కాలుష్య కారక పదార్థాలు వాతావరణంలోకి రాకుండా చూడడం కూడా చాలా ముఖ్యం, దీనికోసం బలోపేతమైన విధానాలను పాటించాలి. రంగాల వారీగా.. ప్రత్యేక పార్కులను నెలకొల్పడం ద్వారా కాలుష్య నివారణా చర్యలు. వాటిని అన్ని పరిశ్రమలు పాటించేలా చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. పారిశ్రామికాభివృద్దికి దోహదపడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. విశాఖపట్నంలో హైఎండ్ ఐటీ స్కిల్ యూనివర్సిటీ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం, దీనికోసం చర్యలు తీసుకోవాలి. ఐటీ రంగంలో ఈ యూనివర్సిటీ గొప్ప మలుపు కాగలదన్న విశ్వాసం వ్యక్తం చేసారు. ఆ యూనివర్సిటీలో ప్రవేశపెట్టాల్సిన కోర్సులు, బోధన అంశాలపై ప్రఖ్యాత ఐటీ నిపుణుల సలహాలు తీసుకోవాలి. హైఎండ్ యూనివర్సిటీ ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలి. అలాగే విశ్వవిద్యాలయాల్లో ఎక్స్టెన్షన్ మోడల్స్పైన దృష్టి పెట్టాలని సీఎం అన్నారు.