YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అచ్చెన్నాయుడిపై అరాచకం

అచ్చెన్నాయుడిపై అరాచకం

విజయవాడ జూలై 2, ‘‘గడిచిన మూడు, నాలుగు నెలలుగా ప్రపంచాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య కరోనా వైరస్ ఏ మాత్రం కూడా తగ్గే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.. అగ్రరాజ్యాలు అతలాకుతలం అయ్యే పరిస్థితులు వచ్చాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు.
మనదేశంలో కూడా పెను సమస్యగా కరోనా మారింది. ఆర్ధికంగా దేశాన్ని దెబ్బతీసింది, ప్రజలను ఆదాయం లేకుండా చేసింది, ప్రజల ఆలోచనలనే మార్చేసింది. ప్రజలంతా భయాందోళనలతో, ఇళ్లలోనుంచి బైటకు కూడా రాలేక, ప్రాణాలు అరచేత పెట్టుకున్న పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా కోటి 6లక్షలు కేసులు నమోదుకాగా, 5లక్షల 16వేల మంది చనిపోయారు. నిన్న ఒక్కరోజే లక్షా 12వేల కేసులు వచ్చాయి.  కరోనా వైరస్ సమస్య ఏవిధంగా ఎదుర్కొంటాం, మళ్లీ ప్రజలను ఏవిధంగా ముందుకు తీసుకెళ్తాం అనేది ప్రతిఒక్కరూ ఆలోచించాలి. ప్రభుత్వాలపై ఈ  బాధ్యత ఎక్కువగా ఉంది. అన్నివర్గాల ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. ఆ విషయం అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు.
కేంద్రం లాక్ డౌన్ ప్రకటించడం, మళ్లీ లాక్ డౌన్ లిఫ్ట్ చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తూ ఏవిధంగా ప్రజలను ఆదుకోవాలి, సమస్య ఏవిధంగా అధిగమించాలో ఆలోచిస్తోంది. రూ21లక్షల కోట్ల ప్యాకేజి వివిధ స్థాయిలో అమల్లో ఉంది. నెలకు 5కిలోల బియ్యం, కిలో కందిపప్పు నవంబర్ దాకా 8నెలల పాటు ఇచ్చే బాధ్యత కేంద్రం తీసుకుంది. 2సార్లుగా రూ500 చొప్పున రూ1,000నగదు ఇచ్చారు. మరి రాష్ట్ర ప్రభుత్వం దీనికి అదనంగా ఏం ఇచ్చిందో చెప్పాలి. ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన లేకుండా పోయింది. కరోనా వల్ల నస్టపోయిన ప్రజలను ఆదుకోవడంలో మొదటినుంచి నిర్లక్ష్యం చేశారు. టిడిపి తప్పు చెబుతోందన్నట్లు మాట్లాడి ఈ రోజు సమస్యను జఠిలం చేశారు. కరోనా లాక్ డౌన్ లతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. పండ్ల తోటల రైతులు, ఆక్వా రైతులు, ఫౌల్ట్రీ వాళ్లు గిట్లుబాటు ధరలేక తీవ్రంగా నష్టపోయారు. వలస కార్మికుల సమస్యలు చెప్పనలవికాదు. వీళ్లను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ప్రతి పేద కుటుంబానికి రూ5వేలు ఇవ్వాలని మేము అడిగినా, ఆందోళనలతో ఒత్తిడి చేసినా పెడచెవిన పెట్టారని విమర్శిపంచారు.
లాక్ డౌన్ పెట్టిన తర్వాత ఏపికి రూ 8వేల కోట్లు ఇచ్చామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంగా చెప్పారు. అవికూడా సక్రమంగా ఉపయోగించకుండా ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టారు. ఏమాత్రం కూడా ప్రజాహితం కోసం పనిచేసే పరిస్థితిలో మీరు లేరు. మేము తక్కువ రేట్లకు కరెంట్ ఇచ్చినా మీరు ఇష్ట ప్రకారం కరెంటు రేట్లు పెంచుతున్నారని ఆమె అంటే, వ్యక్తిగత దాడులకు దిగే పరిస్థితి, అసభ్యంగా ప్రవర్తించే పరిస్థితి. అంటే నిర్మాణాత్మక సూచనలు ఎవరిచ్చినా వాళ్లపై దాడిచేసే పరిస్థితి వుంది.
విశాఖలో మెడ్ టెక్ జోన్ కూడా సరిగ్గా వినియోగించుకోలేని స్థితి. నిన్ననే భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కనుగొన్నారని అంటే నాకు పాత విషయాలన్నీ గుర్తుకొచ్చాయి. టిడిపి ప్రభుత్వం హైదరాబాద్ లో అభివృద్ది చేసిన జెనోమ్ వ్యాలీ పార్క్ లో 20వేల మంది పనిచేసే పరిస్థితి.  ఏసియాలోనే అతిపెద్ద బయోటెక్ పార్ట్ హైదరాబా ద్ లో వచ్చిందంటే ఆరోజు టిడిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితమే. నిన్న మీరు చేసిందేమిటి..? కొత్తగా వచ్చాయా అంబులెన్స్ లు..? ఇంతకు మందు లేవా. టిడిపి ప్రభుత్వం 1800అంబులెన్స్ లు ఉన్నాయి. తల్లి-బిడ్డ ఎక్స్ ప్రెస్ లు, ఫీడర్ అంబులెన్స్ లు, లైఫ్ సపోర్టింగ్ అంబులెన్స్ లు, గిరిజన ప్రాంతాల్లో టూ వీలర్ అంబులెన్స్ లు, మొబైల్ క్లినిక్స్, మహా ప్రస్థానం వాహనాలన్నీ టిడిపి ప్రభుత్వమే తెచ్చింది. టిబి నియంత్రణకు టిడిపి ప్రభుత్వం చేసిన అభివృద్ది వల్లే బారతదేశంలో ఈ రోజు ఏపి 2వస్థానం వచ్చింది. వైద్య ఆరోగ్య రంగంలో టిడిపి ప్రభుత్వం సాధించిన పురోభివృద్దే ఇవన్నీ. పుట్టుక నుంచి జీవితాంతం వరకు వినూత్న సంక్షేమ పథకాలు మేమే తెచ్చాం. వైద్యరంగంలో వినూత్న కార్యక్రమాలు తెచ్చాం.
ఈ రోజు మీరు ఎందుకింత పెద్దఎత్తున కుంభకోణాలకు పాల్పడ్డారు..? విజయసాయి రెడ్డి బర్త్ డే గిఫ్ట్ గా ఆయన అల్లుడికి గిఫ్ట్ గా రూ307కోట్లు అంబులెన్స్ ల కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇప్పుడున్న కాంట్రాక్ట్ ఏజెన్సీ ఎందుకు తొలగించారు. మీకు కావాల్సిన వాళ్లకు ఇచ్చుకోడానికి  తప్పుడు విధానాలు చేస్తారా..? టిడిపి బైటపెట్టిన  రూ307కోట్ల అంబులెన్స్ ల స్కామ్ కప్పిపెట్టడానికే అవన్నీ తీసుకొచ్చి గొప్పగా పెరేడ్ చేస్తారా..?
వైద్య రంగానికి పెద్దఎత్తున టిడిపి ప్రభుత్వమే బడ్జెట్ పెంచింది. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి పౌష్టికాహారం, వైద్యం, ఆరోగ్యం అందించాం. చనిపోయేదాకా సంక్షేమం ఇచ్చామని అన్నారు.
నిన్న అచ్చెన్నాయుడిపై ఎంత అరాచకం చేశారు.. ?ఒక లేఖ రాశాడని ఇలా వేధిస్తున్నారే మీ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి..? ఎన్ని కేసులు ఉన్నాయి, సిబిఐ,ఈడి ..అవిగాక ఇటీవల అంబులెన్స్ లు, మీ సొంత కంపెనీ సరస్వతీ పవర్ కు గనులు, నీళ్లు కేటాయింపు, ఇసుక మాఫియా, మద్యం కుంభకోణాలు, జె ట్యాక్స్ వీటికే సమాదానం చెప్పకుండా ఎదురుదాడి చేయడం తప్పుడు కేసులు పెట్టడం, వాటిని రాయనీకుండా మీడియాపై కేసులు పెట్టడం..
గత 13నెలలుగా టిడిపి శ్రేణులపై 800దాడులు చేశారు, 10మందిని చంపేశారు. కోడెలతో సహా ఏడుగురు ఆత్మహత్యలు చేసుకున్నారు. 20మంది ఉద్యోగులు ఆత్మహత్యా యత్నాలు చేశారు. రాజధాని రైతుల మరణాలు 54, భవన నిర్మాణ కార్మికుల మరణాలు 66, రైతులు 511మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 368మందిపై లైంగిక దాడులు, వాలంటీర్ల అరాచకాలు 68 జరిగాయి.
అచ్చెన్నాయుడిపై అరాచకం చేశారు. అరెస్ట్ లు చేయడంపై  సుప్రీంకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఇచ్చినా కావాలని ఇష్టానుసారంగా చేస్తూ పద్దతిలేని రాజకీయాలు చేస్తున్నారు. టెర్రరిస్ట్ మాదిరిగా అచ్చెన్నాయుడి ఇంటిపై అటాక్ చేశారు.  గేట్లు దూకి ఇంట్లోకి ప్రవేశించారు. ఎక్కడికి పారిపోతాడు ఆయన...? ఇంత అరాచక పాలన ఎప్పుడూ చూడలేదు. ఆపరేషన్ జరిగిందని చెప్పినా వినకుండా 600కిమీ రోడ్లపై 20గంటలు వాహనంలో తీసుకొచ్చారు. గాయం తిరగబెట్టింది, కోర్టు ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పింది, రెండవసారి ఆపరేషన్ చేసే పరిస్థితి రావడానికి కారణం ఎవరు..? నిన్న మొన్న కూడా ఇంకా గాయం మానలేదు, నాకింకా అనారోగ్యంగా ఉందని ఆయన లేఖ రాసినా, మీ పైశాచిక ఆనందం కోసం అచ్చెన్నాయుడిపై ఇలాంటి అరాచకాలకు పాల్పడతారా..?
మాస్క్ అడిగితే ఒక సమర్ధుడైన దళిత డాక్టర్ ను పిచ్చివాడనే ముద్రవేశారు. ముందు సస్పెండ్ చేశారు, తర్వాత తాగుబోతనే ముద్ర వేయాలని చూశారు. ఈ మందులు నాకు ఇవ్వడం ఏమిటని ఆయనే ప్రశ్నిస్తే, దానిపై హైకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించే పరిస్థితి తెచ్చారు. అదే పని అచ్చెన్నాయుడు ఇప్పుడు చేశారు. నా ఆరోగ్యానికి ముప్పు ఉందని, కావాలనే ఇలా చేస్తున్నారని లేఖ రాసినా అచ్చెన్నాయుడిని ఇలా చేస్తారా..? చట్టవ్యతిరేకంగా అధికారులు చేస్తే ఇబ్బందులు పడక తప్పదు. ఇంతకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు చేసి అధికారులు చాలా ఇబ్బందులు పడ్డారు.
200రోజులుగా రాజధాని అమరావతిలో ఆందోళనలు చేస్తున్న రైతులు చేస్తున్న తప్పేమిటి..? ఎక్కడా లీగల్ డిస్ప్యూట్ లేకుండా 29వేల మంది రైతులు 34వేల ఎకరాలు ఇచ్చారు వీళ్ల పార్టీ వాళ్లు కూడా భూములు స్వచ్ఛందంగా ఇచ్చారు, వీళ్లనే గెలిపించారు రెండు సీట్లలో కూడా. అలాంటిది అమరావతిలో ఏం చేశారు..? కావాలనే ఉన్మాదంతో ఏదైతే అదిచేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడం మంచిదికాదు.
హైదరాబాద్ లో ఐటి, బయోటెక్నాలజీ పార్క్, అవుటర్ రింగురోడ్డు, శంషాబాద్ విమానాశ్రయం అనేకం తెచ్చాం, అవన్నీ ఫలితాలు ఇస్తున్నప్పుడు మనకు ఆనందంగా ఉంటుంది. అలాగే అమరావతిలో అభివృద్ది చేయాలని అన్నింటిని సిద్దం చేశాం. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఫ్రాజెక్టుగా అమరావతిని చేశాం. రూ10వేల కోట్ల వ్యయం చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారు ఆ ప్రాజెక్టులన్నీ.? అలాంటి రాజధానిని 3ముక్కలు చేశారు. ఆ అధికారం మీకెవరు ఇచ్చారు..?
వీటన్నింటికి నిరసనగా జెఏసి జులై 4న పిలుపు ఇచ్చింది, రైతులకు సంఘీభావంగా అమరావతికి మద్దతుగా ఒక ర్యాలీ నిర్వహించాలని. అన్ని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు దీనికి మద్దతు ఇచ్చినందుకు అభినందనలు. ఈ ఒక్క సంవత్సరం అక్కడి రోడ్లు, భవనాల నిర్మాణం పూర్తిచేసివుంటే ఆ ప్రాంతమంతా నివాస యోగ్యంగా ఉండేది. ఇవన్నీ పూర్తిచేస్తే అక్కడి సంపద విలువ పెరిగేది. భవిష్యత్తులో ఒక్క పైసా ఖర్చు చేయకుండా అక్కడి భూములతోనే ఆ ప్రాంతాన్ని అభివృద్ది చేసే పరిస్థితి ఉండేది. గతంలో హైదరాబాద్ లో చేసిన అభివృద్దిని తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి కొనసాగించారు. గత ప్రభుత్వాల అభివృద్దిని కొనసాగించడం ప్రస్తుత ప్రబుత్వాల బాధ్యత అంతేతప్ప ఇష్టానుసారం చేయరాదు. ఇది మీ సొంతానికి కాదు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని అన్నారు.

Related Posts