హైదరాబాద్ జూలై 2, ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న చేపపిల్లల కొనుగోళ్ల విషయంలో నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణలో గల తన కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర తో కలిసి జిల్లా మత్స్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోట్లాది రూపాయల ఖర్చు తో చేపట్టిన ఉచితంగా చేప పిల్లల పంపిణీ, సబ్సిడీ పై వాహానాలు, వలలు, కేట్స్ పంపిణీ వంటి అనేక కార్యక్రమాలతో మత్స్య శాఖకు ఎంతో గుర్తింపు వచ్చిందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మత్స్య శాఖకు నిధుల కేటాయింపు నామమాత్రంగా ఉండేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చొరవ తో కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మత్స్య రంగంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న లక్షలాది కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయని అన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలోని 23 వేల నీటి వనరులలో 81 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని నిర్ణయించి టెండర్లను ఆహ్వానించడం జరిగిందని అన్నారు. జిల్లా మత్స్య శాఖ అధికారి, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ అధికారులతో కూడిన బృందం చేప పిల్లల హేచరీలను సందర్శించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేప పిల్లల సైజు, నాణ్యత ఉన్నాయా? లేవా? అని పరిశీలించి నివేదికను అందజేస్తుందని చెప్పారు. తనిఖీ బృందం ఆమోదం తెలిపిన హేచరీల నుండే చేప పిల్లల కొనుగోలు జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని, నిబంధనలకు విరుద్దంగా వ్యవరిస్తే చర్యలు తప్పవని అన్నారు. గత సంవత్సరం వివిధ నీటి వనరులలో సుమారు 5 కోట్ల రొయ్య పిల్లలను విడుదల చేయడం జరిగిందని, ఈ సంవత్సరం కూడా రొయ్య పిల్లలను విడుదల చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చేప పిల్లలను నీటి వనరులలో విడుదల చేసే సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, వీడియో చిత్రీకరణ తప్పకుండ చేపట్టాలని, నిర్దిష్ట సమయంలో చేప పిల్లలు నీటిలో వదిలేల జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేయడం వలన రాష్ట్రంలో మత్స్య సంపద పెద్ద ఎత్తున పెరిగిందని, వాటిని ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యతతో అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. ఇందుకోసం అన్ని జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీ లలో చేపల మార్కెట్ ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను సేకరించాలని అన్నారు.