విజయవాడ, జూలై 3, కరోనా కట్టడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు మేరకు రాష్ట్రంలో కరోనా నియంత్రణకు అధికారులు, సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే, రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల శాతాన్ని ప్రభుత్వం గణనీయంగా పెంచింది. విజయవాడలో 8 చోట్ల ఐ మాస్క్ బస్సులతో కరోనా టెస్టులు నిర్వహిస్తోంది. ఒక్క విజయవాడ నగరంలోనే రోజుకు రెండు వేల మందికి సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, చికిత్సతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యేవారి సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది.అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరి డేటాను వలంటీర్లు, హెల్త్ వర్కర్లు సేకరిస్తున్నారు. మాస్కులు లేకుండా బయటకు రావద్దని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చాక తప్పనిసరిగా హ్యాండ్ శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లరాదని కోరుతున్నారు. బయటకు వెళ్లిన సమయంలో జనసముహాలకి దూరంగా ఉండాలని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, పోస్టర్‌ల ద్వారా కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. కంటైన్‌మెంట్ జోన్లలో కేంద్ర నిబంధనల ప్రకారం అన్‌లాక్ 2.0ను అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు కరోనా పరీక్షలు చేయించుకున్న తర్వాతే ఏపీలోకి అనుమతిస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే కొందరు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలినప్పటికీ.. మిగతవారు వెనక్కి తగ్గకుండా మహమ్మారిపై పోరాటం కొనసాగిస్తున్నారు