ఏలూరు, జూలై 3, ఖరీఫ్ వరి సాగుకు విత్తనాల కొరత లేకుండా ప్రభుత్వం కట్టుదిట్ట చర్యలు చేపట్టింది. ఇప్పటికే వంగడాలను ఏపీ సీడ్స్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు విస్తీర్ణం పెరగనుంది. చెరకు సాగు తగ్గడంతో ఆయా ప్రాంతాల్లో వరి సాగు చేపట్టేందుకు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలో సాధారణ ఖరీఫ్ వరి సాగు విస్తీర్ణం 2.20 లక్షల హెక్టార్లు కాగా, ఈ సారి అదనంగా మరో 5 వేల హెక్టార్లలో సేద్యానికి రైతులు సిద్ధమవుతారని వ్యవసాయాధికారుల అంచనా. మొత్తం మీద 2.25 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు జరగనుంది. దీనికి 1.12 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. రైత్వారీగా 85 శాతం విత్తనాలను సమకూరుస్తుండగా, మరో 15 శాతం విత్తనాభివృద్ధి సంస్థలు, ఏపీ సీడ్స్ ద్వారా ప్రభుత్వం అందుబాటులో ఉంచుతోంది. రైతులకు విశిష్ట సేవలందించేందుకు జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం 936 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించింది. ఈ కేంద్రాల్లో ఇప్పటికే సుమారు 5,215 క్వింటాళ్ల విత్తనాల కోసం రైతులు ఇండెంట్లు పెట్టారు. దీనిలో 3,092 క్వింటాళ్లు ఆయా కేంద్రాలకు సరఫరా చేయగా వాటిని రైతులకు రాయితీపై ఇప్పటికే అందించారు. మెట్ట ప్రాంతంలో నాట్లు ప్రారంభించగా, డెల్టా ప్రాంతంలో నారుమళ్లు సిద్ధమవుతున్నాయి. ఖరీఫ్‌లో సాగుకు అనుకూలమైన వంగడాలపై ఈ ఏడాది ప్రభుత్వం, అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం నిర్దేశించిన వెరైటీలు సాగు చేస్తే మద్దతు ధర లభిస్తుందని సూచించారు. దీనికనుగుణంగా రైతులు ఖరీఫ్‌లో ఎంటీయూ–1061, 1064, 1121, 7029(స్వర్ణ), 1121, 5204(బీపీటీ), 3291(సోనా మసూరి) వంగడాలను సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎంటీయూ–1010, 1156, 1075, 1001, 20471 రకాలతోపాటు సంపద స్వర్ణ వంగడాన్ని సాగు చేయొద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది. సబ్సిడీ వర్తించని రైతులు కూడా ఆర్‌బీకేల నుంచి వరి విత్తనాలను కొనే అవకాశం ప్రభుత్వం కలి్పంచింది. పూర్తి ధరకు నాణ్యమైన విత్తనాలను కొనవచ్చని స్పష్టం చేసింది. ఆర్‌బీకేల్లోని కియోస్‌్కల నుంచిగాని, గ్రామ వ్యవసాయ సహాయకుల నుంచిగానీ ఆర్డర్ చేసిన 48 గంటల్లో రైతు ఇళ్ల ముంగిటకే విత్తనాలు సరఫరా చేసేలా ఏపీ సీడ్స్ ఏర్పాట్లు చేసింది. నాణ్యమైన విత్తనాలు ఆర్‌బీకేల నుంచే అందించి నకిలీ విత్తన వ్యాపారులకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.రైతులకు నాణ్యమైన విత్తనాలను ఏపీ సీడ్స్ ద్వారా సబ్సిడీపై అందజేస్తున్నాం. విత్తనాల దగ్గర నుంచి పంట పండించే వరకూ ప్రభుత్వమే పెట్టుబడులు పెడుతుంది. నాణ్యమైన పంట పండించి ఇవ్వండి. మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారానే కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది.