ప్రగతి భవన్ లో కరోనా
హైద్రాబాద్,
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. చివరికి ఈ మహమ్మారి సీఎం క్యాంపు కార్యాలయం అయిన ప్రగతి భవన్‌ను కూడా వదల్లేదు. ప్రగతి భవన్‌లో విధులు నిర్వర్తిస్తున్న నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా గురువారం రాత్రి గుర్తించారు. ప్రగతి భవన్‌లో భద్రత కోసం వచ్చిన నల్గొండ బెటాలియన్ పోలీసులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో ప్రగతి భవన్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.ప్రగతి భవన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది మొత్తానికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రగతి భవన్‌లోనే ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేశారు. మరోవైపు, ప్రగతి భవన్‌కు వచ్చే సందర్శకులపై ఆంక్షలు విధించారు. మరీ అవసరం అయితే తప్ప సందర్శకులను లోనికి అనుమతించడం లేదు.అయితే, ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో లేనట్లుగా సమాచారం. గురువారం ఆయన ఫాంహౌస్‌లో ఉన్నట్లుగా విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. శుక్రవారం కేసీఆర్ ప్రగతి భవన్‌కు చేరుకొనేలోపు ప్రగతి భవన్ పరిసరాలను శానిటైజ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు.మరోవైపు, తెలంగాణలో మొత్తం 1213 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,570కు చేరుకుంది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే పెద్ద ఎత్తున 998 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో ఉంది. అక్కడ 54 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 48 కొత్త కరోనా కేసులను గుర్తించారు. దాని తర్వాతి స్థానంలో ఖమ్మం జిల్లా ఉంది. ఇక్కడ 18 కేసులు నమోదయ్యాయి. గురువారం మరో ఎనిమిది మంది కరోనాకు బలి కాగా, మొత్తం సంఖ్య 275కి చేరింది.