60 రూపాయిలకు చేరిన టమాటా
హైద్రాబాద్,
టమాటా.. ఈ మాట వింటేనే ఎంత మాట అనేంతగా ఆశ్చర్యపడాల్సివస్తోంది. ప్రస్తుతం దీని ధర బెంబేలెత్తిస్తోంది. మొన్నటి దాకా సామాన్యులకు అందుబాటు ధరల్లో లభ్యమైన టమాటా రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.60 పలుకుతోంది. లాక్‌డౌన్, వేసవిలో ధరలు నిలకడగానే ఉన్నా.. వారం పదిరోజులుగా తన ప్రతాపం చూపిస్తోంది. అప్పుడు కిలో రూ.20 నుంచి రూ.30 పలికింది. ప్రస్తుతం మూడింతలు పెరిగింది. హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో టమాటా రూ.40 పలుకుతోంది. కానీ రిటైల్ మార్కెట్‌లోనే హాట్‌హాట్‌గా మారింది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. కాగా.. గత ఏడాది ఇదే సమయంలో కిలో టమాటా రూ.30 పలకడం గమనార్హం. గ్రేటర్ ప్రజల టమాటా అవసరాలు ఎక్కువ శాతం శివారు ప్రాంతాల నుంచి వచ్చే దిగుమతులే తీరుస్తాయి. రెండు వారాలుగా నగర మార్కెట్లకు ఆశించిన స్థాయిలో రావడంలేదు. అంతేకాకుండా శివారు ప్రాంతాల్లో పంట ఇంకా చేతికి రాలేదు. ఉన్న కొద్దిపాటి టమాటాను గ్రేటర్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీంతో దీని ధరలు విపరితంగా పెరిగాయి. నెల రోజుల్లో టమాటా పంట చేతికి వస్తే ఎక్కువ మోతాదులో దిగుమతులు ఉంటాయని, దీంతో ధరలు తగ్గుతాయని మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి. మరోవైపు మళ్లీ లాక్‌డౌన్ చేస్తారనే సంకేతాల నేపథ్యంలో వినియోగదారులు టమాటాను భారీ స్థాయిలో కొనుగోలు చేయడంతో కూడా డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతోనూ ధరలపై ప్రభావం చూపుతోందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. శివారు ప్రాంతాల నుంచి టమాటా దిగుమతులు తగ్గడంతో హోల్‌సేల్ వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువస్తున్నారు. కర్ణాటక, ఏపీ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి నగర హోల్‌సెల్ మార్కెట్లకు దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో రవాణా చార్జీలు, ఏజెంట్ల కమీషన్‌తో పాటు ఇక్కడి మార్కెట్‌లో హోల్‌సేల్ వ్యాపారులు వాటా.. ఇవన్నీ కలుపుకొని టమాటా ధరలు పెరుగుతున్నాయి. కాగా.. మార్కెట్ కమీషన్ ఏజెంట్లు ఇతర ప్రాంతాల నుంచి టమాటా తెప్పించి ఎక్కువ లాభాల కోసం ధరలు విపరీతంగా పెంచి అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్ అధికారులు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. ఇటీవల మార్కెట్‌లో ఓ వ్యక్తి కరోనా వ్యాధి బారిన పడ్డారని, దీంతో హమాలీలు, వ్యాపారులు మార్కెట్‌ను బంద్ చేయాలని కోరారు. కమిటీ సభ్యులు సమావేశమై 3 రోజుల మార్కెట్‌ను బంద్ చేయాలని తీర్మానించారు. ఈ మూడ్రోజుల్లో మార్కెట్‌లో శానిటైజేషన్ చేయాలని నిర్ణయించారు.