బొమ్మపడి వంద రోజులు
అదిలాబాద్,
మూడు ఫైట్లు, ఆరు పాటలతో కళకళలాడాల్సిన సినిమా థియేటర్లు కరోనా దెబ్బకు మూన్నెళ్లుగా తెరుచుకోవటం లేదు. ప్రతిరోజు ప్రేక్షకుల సందడితో కన్పించే సినిమా థియేటర్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. కొత్త సినిమా వచ్చిదంటే ప్రేక్షకులు, అభిమానులతో కిక్కిరిసిపోయే సినిమా హాళ్లు కళావిహీనంగా మారుతున్నాయి. పిల్లలు, పెద్దలకు వినోదం అందించే చోట పనిచేసే సినీకార్మికుల కష్టాలు అంతాఇంత కాదు. ఏళ్ల తరబడి ఇదే వృత్తిలో కొనసాగుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. థియేటర్ల మూసివేతతో కుటుంబ పోషణ గగనమైంది. సినిమా తెరపై బొమ్మ పడేదెప్పుడో.. తమ బతుకులకు భరోసా కలిగేదెప్పుడో..అని ఎదరుచూస్తున్న సినీ కార్మికుల దయనీయమైన జీవనంపై ప్రత్యేక కథనం..కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మొదలైన లాక్‌డౌన్ సినిమా థియేటర్లపై కొనసాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలతో కొన్నింటికి ఆంక్షలు సడలించినా ధియేటర్లకు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. సాధారణంగా ఓ మంచిసినిమా ఆడితే థియేటర్లకు ఒక రోజుకు వచ్చే ఆదాయం కనీసం రూ.50 వేల పైనే ఉంటుంది. కానీ మూసివేత కారణంగా మూడునెలల కాలంలో ఒక్కో థియేటర్ సుమారు లక్షలాది రూపాయల ఆదాయం కోల్పోయింది. ఈనేపథ్యంలో థియేటర్ల యాజమాన్యం సినీకార్మికులు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేమని చేతులు ఎత్తేసింది. మరికొన్ని యాజమాన్యాలు అయితే విధుల నుంచే తొలగించడంతో ఎన్నో ఏళ్లు సినిమా టాకీస్‌లనే నమ్ముకుని జీవనం సాగించిన వారి పరిస్థితి దారుణంగా మారింది. ఒకవైపు వయస్సు పైబడి పోవడం.. కరోనా సమయంలో ఎక్కడా పనిదొరక్క పోవడంతో అనేక ఇబ్బందులతో కుటుంబ జీవనాన్ని నెట్టుకువస్తున్నారు. జిల్లాలో తొమ్మిది వరకు సినిమా థియేటర్లు ఉన్నాయి. ఒక్కో టాకీస్‌లో 20 మంది వరకు విధులు నిర్వహిస్తుంటారు. థియేటర్‌లో ఆపరేటర్, బుకింగ్ కౌంటర్‌లో ఉద్యోగులు, గేటు కీపర్లు, రివైండర్, స్వీపర్లు, స్కావెంజర్, వాచ్‌మెన్‌లు, మేనేజర్‌లతో పాటు సైకిల్‌స్టాండ్, క్యాంటీన్‌లో తినుబండరాలు అమ్మేవారు కనీసం నలుగురు ఉంటారు. వీరి సంఖ్య దాదాపుగా 200కు మించి ఉంటుందని తెలుస్తోంది. ఒక్కొక్కరి విధుల నిర్వహణను బట్టి రూ.9వేల నుంచి రూ.14వేల వరకు వేతనాలు చెల్లిస్తుంటారు. వీరిలో ఏళ్ల తరబడి థియేటర్లను నమ్ముకుని పనిచేసే వారు సగానికి పైగా¯నే ఉన్నారు. ప్రస్తుత కరోనా ప్రభావంతో «థియేటర్ల మూసివేతకు నిర్ణయం తీసుకోవడంతో వీరి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఒకటి రెండు థియేటర్ల యాజమానులు 50శాతం వేతనం ఇస్తున్నా మిగిలిన వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కొంత మంది కార్మికులు ఇతర మార్గాలను వెతుక్కోని పనిలో నిమగ్నమయ్యారు. ఇది తప్ప వేరే ఏపనీ తెలియని వారు రేపోమాపో బొమ్మపడక పోదా.. అనే గంపెడు ఆశతో వేతనం లేకపోయినా థియేటర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దాతల సహకారంతో కొందరు.. అప్పులు చేసుకుంటూ మరికొందరు బతుకును సాగిస్తున్నారు. థియేటర్లు తెరిచే వరకు ప్రభుత్వం ఆదుకోవాలని సినీ కార్మికులు కోరుతున్నారు.