జూన్ లో భారీగా పెరిగిన ఆదాయం
హైద్రాబాద్,
లాక్‌డౌన్ ఎత్తివేసిన తరువాత అన్‌లాక్ 1లో రాష్ట్ర ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) ఫర్వాలేదనిపించాయి. జూన్ నెలలో తెలంగాణ రాష్ట్రానికి రూ.3276 కోట్లు వచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ దేశవ్యాప్తంగా జూన్‌లో జిఎస్‌టి వసూళ్లపై ప్రకటనను విడుదల చేసింది. దీని ప్రకారం కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కాలంలో ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రం దాదాపుగా జిఎస్‌టి రాబడి కో ల్పోయింది. అయితే అన్‌లాక్‌లో మాత్రం పరిస్థితిలో కొం తమార్పు కనిపించింది. రెండు నెలలు పూర్తిగా మూతపడిన కొన్ని వ్యాపార సంస్థలు ఒక్కసారిగా తెరుచుకోవడం, ప్రజలు కూడా రెండు నెలలుగా కొనుగోలు చేయని అవసరమైన వస్తువులను జూన్‌లో కొనుగోలు చేశారు.అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు ప్రారంభం కావడం, అంతరాష్ట్ర రవాణా సౌకర్యాలు పునఃప్రారంభం కావడంతో జిఎస్‌టి ఆదాయం కొంత మెరుగైందని ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు మన తెలంగాణకు వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతున్న సమయంలో రాష్ట్రంలో వృధ్దిరేటు నమోదైంది. అందులో భాగంగానే బడ్జెట్ సమయంలో 202021కి గాను రూ.32,671 కోట్లు ప్రభుత్వం అంచనా వేసింది. అంటే సగటున నెలకు దాదాపు రూ.3 వేల కోట్లుగా ఉంది. అయితే ఈ జూన్ నెలలో రూ.3267 కోట్లు వచ్చింది. గతేడాది జూన్‌లో వచ్చిన జిఎస్‌టి కంటే ఇది మూడు శాతం అధికం కావడం గమనార్హం. గత జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి జిఎస్‌టి ద్వారా రూ.3166 కోట్లు వచ్చింది.లాక్‌డౌన్ ప్రభావంతో అన్ని రాష్ట్రాలు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. జూన్ నెలలో దాదాపు 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గతేడాది జూన్‌లో వచ్చిన జిఎస్‌టి కంటే తక్కువ ఆదాయాన్ని ఈసారి నమోదు చేశాయి. ఇందులో హిమచల్ ప్రదేశ్, ఉత్తరాఖాండ్, హార్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మేఘలాయ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిస్సా, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. అయితే ఏప్రిల్, మే నెలల్లో పూర్తి లాక్‌డౌన్ అమలైనందున అసలు జిఎస్‌టి ఆదాయం లేదని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా గత ఏడాది ఏప్రిల్‌లో రూ.1.13 వేల కోట్లు రాగా, ఈసారి రూ.32,294 కోట్లు వచ్చింది. అలాగే గత మే నెలలో రూ. లక్ష కోట్లు రాగా ఈసారి రూ.62 వేల కోట్లు వచ్చింది. గత జూన్‌లో రూ.99,940 కోట్లు కాగా, ఈసారి రూ.90,917 కోట్లు వచ్చింది. అయితే నిర్వహణలో సిఎం కెసిఆర్ సూచనలకు అనుగుణంగా ఆదాయ నిర్వహణలో రాష్ట్రం మెరుగ్గా ఉందని ఆర్థిక విశ్లేషకులు పేర్కొన్నారు.