కొత్తపేట జూలై 3, తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలోని పెనికేరు గ్రామంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడంవల్ల ఆ గ్రామంలో కొన్ని ప్రాంతాలను రెడ్జోన్ ప్రకటించారు. గత 15 రోజులుగా రెడ్జోన్ ప్రాంతాలలో నివాసం ఉంటున్న కుటుంబాలు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. లాక్ డౌన్ తో నిరుపేదలకు ఉపాధి లేక పూట గడవడమే కష్టంగా మారడంతో వారిని ఆదుకొనేందుకు పెనికేరు గ్రామం పూర్వ విద్యార్థులు ముందుకువచ్చారు. సుమారు మూడు లక్షల రూపాయల విలువగల కూరగాయలు, నిత్యావసరాలు, కోడిగుడ్లును ఆలమూరు ఎస్ఐ ఎస్.శివ ప్రసాద్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై శివప్రసాద్ మాట్లాడుతూ వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో పూర్తి స్థాయిలో భద్రత పాటించాలన్నారు. గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో మన ఊరు మన బాధ్యత అంటూ పూర్వ విద్యార్థులు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా అభినందనీయమన్నారు. గ్రామంలోని యువత వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు. అలాగే పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ రెడ్జోన్ ప్రాంతంలోని ప్రజలు అందరూ మానసికంగా ధైర్యంగా ఉండాలన్నారు. 60 సంవత్సరాలు నిండినవారు 10 సంవత్సరాల లోపు పిల్లలు బయటకి రాకూడదు అన్నారు. తరచూ మోచేతి వరకు చేతులను సబ్బుతో 20 సెకన్లు పాటు కడుక్కోవాలన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ శానిటైజర్ లు ఉపయోగించాలని సూచించారు. కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టాలంటే ప్రతి ఒక్కరూ శుభ్రత పాటించి ఇంటి నుండి బయటకు రాకుండా ఉండటం దానికి మందు అని వారు అన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో సేవలందిస్తున్న వైద్య సిబ్బంది, పోలీస్, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఆశావర్కర్లు, పారిశుద్ధ్య సిబ్బందికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.