హైదరాబాద్ జూలై 3 కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది ప్రతిఒక్కరు వారి ఇళ్లలోనే బోనాల పండుగ జరుపుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సూచించారు. బోనాల సందర్భంగా ఎలాంటి ఊరేగింపులు ఉండవని ప్రకటించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాలి బోనాల జాతర నిర్వహణపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఆలయ ఈవో అనిల్‌కుమార్, పండితులు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి దృష్ట్యా ఆలయంలోనే వేదపండితులు, ట్రస్ట్ సభ్యుల మధ్య జాతర నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఏడాది ఆనవాయితీగా జరిగే పూజలు సంప్రదాయబద్దంగా నిర్వహిస్తామని వెల్లడించారు. బోనాల వేడుకలను ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. వచ్చే శుక్రవారం, ఆదివారం, సోమవారాల్లో భక్తులకు ప్రవేశం లేదన్నారు. ఆదివారం నాటి పూజలు, సోమవారం జరిగే రంగం యధావిధిగా కొనసాగుతుందని చెప్పారు. జాతరలో తానుకూడా పాల్గొనడం లేదని తెలిపారు.