కడప, జూలై 4,
నిన్నమొన్నటి వరకు విద్యార్థులకు పాఠాలు నేర్పిన గురువులు నేడు పొట్టకూటి కోసం పనులకు వెళ్తున్నారు. ప్రైవేటు పాఠశాలలను నమ్ముకొని జీవనం సాగించిన వారంతా కరోనా ప్రభావంతో వచ్చిన లాక్‌డౌన్‌తో తమ వృత్తిని వదిలి జీవనోపాధికోసం దొరికిన పనులువైపు మళ్లి జీవనోపాధి వెతుక్కుంటున్నారు. అలవాటులేని పనులు చేస్తూ కుటుంబ భారాన్ని నెట్టుకొస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 536 ప్రైవేటు పాఠశాలలు, 165 జూనియర్ కళాశాలలు, 99 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 13వేల మంది వరకు పనిచేస్తున్నారు. ఒకటి రెండు చోట్ల పూర్తిస్థాయిలో సిబ్బందికి జీతాలు చెల్లిస్తుండగా కొన్ని పాఠశాలు, కళాశాలల్లో సిబ్బందికి యాజమాన్యాలు సగం జీతాలు ఇస్తూ నెట్టుకొస్తున్నారు. మరికొన్ని చోట్ల అసలు జీతాలే ఇస్తున్న దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో చాలామంది వేర్వేరు పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఎంఏ బీఈడీ చదివిన నేను పదిహేనేళ్లుగా ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. వచ్చిన కాస్తో కూస్తో జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాను. కరోనా లాక్‌డౌన్ కారణంగా మార్చి 23 నుంచి పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు అధికమయ్యాయి. జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో చేసేదేమీలేక గ్రామంలో ప్రభుత్వం కలి్పస్తున్న ఉపాధి పనులకు వెళ్తున్నాను. అలవాటులేని పనికావడంతో కాస్త కష్టంగా అనిపిస్తుంది. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సిందే