హైద్రాబాద్, జూలై 4,
తెలంగాణ లో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటం, మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే ప్రచారం.. జోరుగా జరుగుతుండటంతో హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. తాజాగా తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. గత 24 గంటల్లో 1892 పాజిటివ్ కేసులు నమోదు, ఎనిమిది మంది మృతి, జీహెచ్ఎంసీ పరిధిలోనే 1,658 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.ఉపాధి కోసం వలసొచ్చిన వారంతా తిరిగి సొంతూళ్ల బాట పట్టారు. హైదరాబాద్ లో పూర్తిగా స్థిరపడిన వారు మాత్రమే ఉండటానికి మొగ్గు చూపుతుండగా.. అద్దె ఇళ్లలో ఉంటూ.. ఆదాయం కోల్పోయిన వారు నగరంలో ఖర్చులు భరించలేక సొంతూరు వెళ్లి ఏదో ఒక పని చేసుకొని బతకొచ్చనే ఉద్దేశంతో నగరాన్ని వీడుతున్నారు. దీంతో నగరంలోని చాలా కాలనీల్లో టు-లెట్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి.కరోనా ప్రభావం నగరంలోని సగటు జీవిపై తీవ్రంగా పడింది. లాక్‌డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయినప్పటికీ.. ఆ తర్వాత తిరిగి సాధారణ పరిస్థితులు ఉంటాయని నగరవాసులు ఆశించారు. కానీ ప్రస్తుత పరిణామాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. కరోనా కేసులు అంతకంతకు పెరుగుతుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దీంతో చిరువ్యాపారాలు చేసుకొని కుటుంబాన్ని సాకే వారిపై తీవ్ర ప్రభావం పడింది. వీధి వ్యాపారుల నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకూ అందరిపైనా కరోనా ప్రభావం ఉన్నప్పటికీ.. ఆర్థికంగా అంతగా బలంగా లేకపోవడంతో చిరు ఉద్యోగులు, చిన్నాచితకా వ్యాపారాలు చేసుకునే వారు, ఆటోలు, ట్యాక్సీలు నడుపుతూ బతికేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.కరోనా ఎఫెక్ట్‌కు పిల్లల ఆన్‌లైన్ క్లాసులు తోడవడంతో... వారికి స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌లాప్‌లు కొనిచ్చే పరిస్థితి లేక తల్లిదండ్రులు సతమతం అవుతున్నారు. పల్లెటూళ్లలో కరోనా భయం తక్కువగా ఉండటం, ఏదో ఒక పని చేసుకోవచ్చనే ధీమా, ఖర్చు తక్కువ అనే ఆలోచన అన్నీ కలిసి నగరంలో చాలా ఏళ్లుగా నివాసం ఉంటున్నవారు సైతం అద్దె ఇళ్లను ఖాళీ చేసి సొంతూరు వెళ్తున్నారు.ఈ ప్రభావం ఇళ్లను అద్దెలకు ఇచ్చి.. ఆ డబ్బులతోనే జీవితం గడిపే ఇంటి యజమానులపైనా పడింది. ఒకప్పుడు టు-లెట్ బోర్డు కనిపిస్తే చాలు వారం గడిచే సరికి కచ్చితంగా ఎవరో ఒకరు వచ్చి చేరేవారు. చిన్న కుటుంబం, అద్దె ఎక్కువగా ఇవ్వగలిగే వారికి ఓనర్లు ఇంటిని కిరాయికి ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటోంది. నగరంలోని ఏ ప్రాంతంలో చూసినా టు-లెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. అద్దె పెంచకపోగా.. ఇంతకు ముందున్న వారు చెల్లించినంత కూడా చెల్లించడానికి కొత్తగా వచ్చే వారు సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో చాలా ఇళ్లు ఖాళీగా ఉంటున్నాయి.కొత్తగా ఎవరైనా ఇంట్లోకి వస్తే.. వారికి ఎక్కడ కరోనా ఉంటుందోననే అనుమానంతో కొందరు ఇంటి యజమానులు ఇల్లును ఖాళీగా ఉంచుతున్నారే కానీ అద్దెకు ఇవ్వడం లేదు. దీంతో నగరంలో ఖాళీ ఇళ్ల సంఖ్య పెరిగిపోతోంది. ఐటీ సంస్థల్లో పని చేసే చాలా మంది లాక్‌డౌన్ కంటే ముందే నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లారు. వాళ్లు అద్దెలు కడుతున్నప్పటికీ.. ఇళ్లు మాత్రం ఖాళీగా ఉంటున్నాయి. ఆఫీసులు తెరవకపోవడం, జనం ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో.. ఒకరిపై మరొకరు ఆధారపడి బతికే గొలుసు కట్టు దెబ్బతింది.హైదరాబాద్ వస్తే ఏదో ఒక పని చేసుకొని ఉన్నంతలో బాగా బతకొచ్చనే ధీమా గతంలో ఉండేది. కానీ కరోనా దెబ్బకు పరిస్థితి మొత్తం మారిపోయింది. నగరంలో బతకడం కష్టమేనంటూ వలస జీవులు వెనక్కి మళ్లుతున్నారు.