YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

టెలిమెడిసిన్ తీసుకుంటున్న 10 వేల మంది

టెలిమెడిసిన్ తీసుకుంటున్న 10 వేల మంది

హైద్రాబాద్, జూలై 4, 
 హోం ఐసోలేషన్ ఉన్న కరోనా రోగులకు ఇబ్బందులు కలుగకుండా వైద్యారోగ్యశాఖ టెలీమెడిసిన్ విధానంలో వైద్యసేవలందిస్తుంది. రోగుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పడికప్పుడు తెలుసుకుంటూ వైద్యులు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ప్రతి రోగికి రోజులో రెండు సార్లు కాల్ చేసి మెడిసిన్స్ వాడే తీరు, తీసుకోవాల్సిన ఆహారంపై తగిన జాగ్రత్తలు ఇస్తూ వారి ఆరోగ్యం మెరుగయ్యే విధంగా కృషి చేస్తున్నారు. వైరస్ తేలిన రోజు నుంచి 17 రోజుల పాటు ఈ విధంగా పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు అన్నారు. సీరియస్ కండిషన్ ఉన్న వాళ్లను కూడా వెంటనే ఆసుపత్రులకు తరలించి వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నామని వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వేల్ఫేర్ కార్యాలయంలో ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి 24 గంటల పాటు కరోనా రోగులను పర్యవేక్షిస్తున్నామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.టెలి, వీడియో కాల్స్ రెండు విధానాల్లో పేషెంట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని డాక్టర్లు అంటున్నారు.సుమారు 10 వేల మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. వీరికి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఫోన్లు చేసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటామని కాల్ సెంటర్ ఇంచార్జీ డా విజిత తెలిపారు. 24 గంటల పాటు కాల్ సెంటర్‌ను కొనసాగిస్తూ కోవిడ్ రోగులను పర్యవేక్షిస్తున్నామని అమె అన్నారు. పాజిటివ్ వచ్చిన రోగులు గదిలో ఎలా ఉండాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి?ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? వంటివి వివరిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. ఎవరికైనా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే వారికి వీడియో కాల్ ద్వారా వైద్యులతో సలహాలు, సూచనలు ఇప్పిస్తున్నామని వైద్యారోగ్యశాఖ అధికారులు చెప్పారు.అంతేగాక వారికి అవసరమైన మందుల ప్రిస్కిప్షన్‌ను కూడా ఆన్‌లైన్ విధానంలో పంపిస్తున్నామని హైదరాబాద్ డిఎమ్‌హెచ్‌ఓ డా వెంకట్ తెలిపారు. ఒకవేళ రోగికి సీరియస్ కండిషన్ ఉంటే వెంటనే 108 ద్వారా సదరు బాధితుడిని అవసరమైన ఆసుపత్రులకు తరలిస్తున్నామని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.మందు లేని మహమ్మారి సోకడంతో చాలా మంది భయాందోళనకు గురవుతున్నారని కాల్ సెంటర్ వైద్యులు పేర్కొంటున్నారు. కానీ కోవిడ్ సోకిన వారిలో సుమారు 90 శాతం మంది కోలుకుంటున్నారని, కేవలం ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారి పరిస్థితి మాత్రమే కొంత ఆందోళనకరంగా ఉంటుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్న వారికి ఆత్మస్థైర్యం పెరిగేలా సూచనలు, సలహాలు కూడా ఇస్తున్నామని వైద్యులు తెలిపారు. కొందరికి అసింప్టమాటిక్‌తో పాజిటివ్ రావడంతో అయోమయం స్థితిలో ఉంటున్నారని, అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇస్తూ వైద్యం అందిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు. రోగ నిరోధక శక్తిని, మానసిక స్థితిని మెరుగుపరుస్తూ వారికి వైద్యం అందిస్తున్నారు. సాధారణంగా 40పైబడిన వారిలో ఇతర ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి కావున వారే అధికంగా టెన్షన్ పడుతున్నారని, యంగ్ స్టేజ్‌లో ఉన్న వారు వైరస్ సోకిన పెద్దగా ఆందోళన చెందడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.ఉదయం 9 నుంచి రాత్రి 11 వరకు వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటారని కాల్‌సెంటర్ ఇంచార్జీ తెలిపారు. అదే విధంగా వైరస్ సోకిందని మానసికంగా కృంగిపోతున్న రోగులకు ముఖముఖిగా డాక్టర్ చూపించి వారిలో మనోధైర్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని అధికారులు చెప్పారు. దీంతో పాటు కొందరు రోగులు నేరుగా కాల్ సెంటర్‌కు ఫోన్లు చేస్తున్నారని, వారికి కూడా సలహాలు ఇస్తున్నామని వైద్యులు తెలిపారు. అంతేగాక ఒకవేళ వారు ఫోన్లు చేయకపోయినా తామే కాల్ చేసి వివరాలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. ఒకసారి ఫోన్ ఎత్తకపోయినా, రెండు మూడు సార్లు ఫోన్ లైన్లను కలుపుతున్నామని అధికారులు చెబుతున్నారు. అదే విధంగా ప్రైవేట్ ల్యాబ్స్‌లో పాజిటివ్ వచ్చిన వారిని కూడా ఇక్కడ్నుంచే పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.ఈ కాల్ సెంటర్‌లో మూడు షిఫ్టులు ఉంటాయని, ప్రతి షిఫ్టులో సుమారు 50 నుంచి 60 మంది పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. వీరిలో ప్రతి షిప్టుకు 20 మంది వైద్యులు బాధితులకు సేవలందిస్తున్నారు. హోం ట్రీట్మెంట్‌లో అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించడంలో వీరిది క్రియాశీలక పాత్ర. హోం ట్రీట్మెంట్ పొందుతున్న వారికి ఇబ్బందులు తలెత్తితే టోల్ ఫ్రీ 18005994455 లేదా 108, 104లను కూడా సంప్రదించవచ్చని అధికారులు వెల్లడించారుఇంట్లో హోం ఐసోలేట్ అయ్యేందుకు సరైన సౌకర్యాలు లేకపోతే తామే నేచర్ క్యూర్ ఇఎస్‌ఐ, ఫీవర్ ఆసుపత్రులకు సదరు బాధితులను పంపిస్తామని వైద్యారోగ్యశాఖ చెబుతుంది. అక్కడ కూడా వారికి అందించాల్సిన ఏర్పాట్లను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని ఆరోగ్యశాఖ పేర్కొంది.ఇళ్ల వద్ద చికిత్స తీసుకుంటున్న కరోనా రోగులకు అవసరమైతే ఆక్సిజన్ సిలిండర్లను కూడా పంపిస్తామని అధికారులు అంటున్నారు. వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే 108 ద్వారా ఆసుపత్రికి చేరుకునే లోపల ఆలస్యమవుతుందని, ఈలోపల బాధితుడి ఆరోగ్యం విషమించే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Related Posts