YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

జిల్లాల్లో నామ్ కే వాస్తేగా కరోనా పరీక్షలు

జిల్లాల్లో నామ్ కే వాస్తేగా కరోనా పరీక్షలు

వరంగల్, జూలై 4, 
జిల్లాలో కరోనా టెస్టులను నిలిపివేశారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్‌ కాంటాక్టు ద్వారా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న సమయంలో పరీక్షలు చేయకపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. జిల్లాలో ఇప్పటి వరకు 81 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా కేవలం ఫర్టిలైజర్‌ కాంటాక్టు ద్వారా 63 మందికి వైరస్‌ వచ్చినట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ నిర్ధారించింది. లక్షణాలు కనిపించిన మరికొంత మందిని వైద్యుల పర్యవేక్షణలోహోం క్వారంటైన్‌లో ఉంచారు. ఫర్టిలైజర్‌ యజమానికి పాజిటివ్‌ రిపోర్టు రాగానే అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం, 17వ తేదీ మినహా 20వ తేదీ వరకు రోజుకు 50 మంది చొప్పున శాంపిళ్లను సేకరించారు. ఇందులో ఒక్కరోజు 34 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆపేసినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఫర్టిలైజర్‌తో కాంటాక్టు ఉన్న వ్యక్తులు ఆందోళనకు గురవుతున్నారు. దగ్గు, జలుబుతో బాధపడుతూ పలువురు పరీక్షలు చేయాలని జనగామ జిల్లా ఆస్పత్రికి వెళితే ఆరోగ్యంగానే ఉన్నారని మాత్రలు ఇచ్చి పంపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మున్సిపల్‌ ముఖ్యనాయకులు, వ్యాపార వేత్తలు, కీలక అధికారులు, సామాన్యులకు సంబంధించి, ఈ నెల20న జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో 61 మంది నుంచి కరోనా టెస్ట్‌ కోసం లాలాజలాన్ని సేకరించారు. శాంపిళ్లను సేకరించిన వెంటనే, పరీక్షల కోసం వరంగల్‌ ఎంజీఎంకు పంపించాల్సి ఉంటుంది. కానీ వాటిని అక్కడకు పంపించకుండా, వృథా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. జనగామలో కరనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న సమయంలో టెస్ట్‌లను పెంచి కాంటాక్టు కేసులను తగ్గించే ప్రయత్నం చేయాల్సింది పోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ఓ వ్యాపార వేత్త మాట్లాడుతూ 20వ తేదీన తీసిన శాంపిళ్లను పరీక్షలకు పంపించకుండా నిర్లక్ష్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం రఘునాథపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 20 మంది రైతులను శాంపిళ్ల కోసం పీహెచ్‌సీకి పిలిపించి సాయంత్రం వరకు అక్కడే ఉంచుకుని పరీక్షలు చేయకుండానే పంపించేశారు. దీనికి తోడు జిల్లాలో మూడు రోజులుగా కరోనా టెస్ట్‌లను నిలిపి వేయడంతో ఫర్టిలైజర్‌తో కాంటాక్టులో ఉన్న చాలా మంది భయాందోళనకు గురువుతు న్నారు. ఈ విషయమై డీఎంహెచ్‌ఓ మహేందర్‌ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని ఫర్టిలైజర్‌తో దాదాపుగా కాంటాక్టులు తొలగిపోనట్లేనన్నారు. గతంలో చేసిన పరీక్షలకు సంబంధించి ఒకేరోజు 34 కేసులు రాగా, వారి పర్యవేక్షణలో వైద్యారోగ్య శాఖతో పాటు మిగతా అధికారులు కూడా ఉన్నారన్నారు.

Related Posts