అదిలాబాద్, జూలై 4
అక్రమ పత్తి విత్తనాల వ్యాపారుల చేతుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు చిక్కుకున్నారు. మన దేశంలో అనుమతి లేని బీజీ3 విత్తనాల మాయలో పడ్డ రైతులు ఊళ్లల్లోకి వచ్చిన విత్తనాలను ఎగబడి కొంటున్నారు. ఈ విత్తనాలతో అధిక దిగుబడి రావడమే గాక గడ్డి సమస్య ఉండదని దళారులు చెప్పే మాటలను నమ్మి ఊరు పేరు లేని పత్తి విత్తనాలను వేలంవెర్రిగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 60 శాతం రైతులు పత్తి సాగుచేస్తే అందులో బీజీ3గా చెపుతున్న ‘లూజు’ విత్తనాలను నాటిన రైతులే ఎక్కువ. బీజీ3 విత్తనాల వల్ల భూసారం తగ్గుతుందని భయపడి సొంత భూముల్లో వ్యవసాయం చేసే రైతులు మాత్రమే బ్రాండెడ్ కంపెనీల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తుండగా, 80 శాతం కౌలు రైతులు మాత్రం అధిక దిగుబడి కోసం వరకు బీజీ విత్తనాల మాయలో పడిపోయారు.ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల్లో పత్తి సాగుబడి ఎక్కువ. సుమారు 6లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణం ఉన్న ఉమ్మడి జిల్లాలో ఈ సంవత్సరం 3.20 లక్షల హెక్టార్లలో పత్తిని సాగు చేస్తున్నారు. గత సంవత్సరం ప్రభుత్వం చెప్పిన మాటలు విని పత్తి స్థానంలో సోయా సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. అదే సమయంలో పత్తికి గిట్టుబాటు ధర పెరగడంతో ఈసారి రైతులు పత్తి సాగుపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. దీన్ని అక్రమ వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. నెల్లూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల నుంచి వచ్చిన వ్యాపారులు ఏకంగా మండల కేంద్రాల్లోనే దందాకు తెరలేపారు.ఉమ్మడి జిల్లాలో బీజీ3 పత్తి విత్తనాల పేరుతో కోట్ల రూపాయల వ్యాపారం సాగినట్లు వ్యవసాయ అధికారులే ఒప్పుకుంటున్నారు. మండల, జిల్లా వ్యవసాయ అధికారులెవరూ ఈ విత్తన వ్యాపారుల జోలికి వెళ్లిన దాఖలాలు తక్కువ.ఏప్రిల్ 17న మందమర్రి మండలం గద్దెరాగిడిలో సుమారు రూ.90లక్షల విలువ చేసే అక్రమ విత్తనాలను పోలీసులు, వ్యవసాయ అధికారులు సీజ్ చేశారు.రైతులనే ఏజెంట్లుగా పెట్టుకొని గత రెండు నెలలుగా బీజీ3 పేరుతో వ్యాపారం ప్రారంభించారు. వర్షాలు పడడంతో పత్తి సాగుకు రైతులు సిద్ధం కాగానే దళారులు వారిని ఆశ్రయించి తక్కువ ధరకు పత్తి విత్తనాలు అంటగట్టారు. మార్కెట్‌లో పేరున్న కంపెనీలకు చెందిన 450 గ్రాముల పత్తి విత్తనాల ప్యాకెట్ రూ.900 వరకు ఉండగా, అరకిలో లూజు (పాకెట్ లేకుండా) పత్తి విత్తనాలను రూ.500 లోపు విక్రయించడం ప్రారంభించారు. డిమాండ్ పెరగడంతో రైతులనే ఏజెంట్లుగా నియమించుకొని భారీగా వ్యాపారం సాగించారు. ఇప్పటికే సుమారు 2లక్షల హెక్టార్లలో పత్తి సాగు అయినట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెపుతుండగా, అందులో 60 శాతం ఈ బీజీ3 విత్తనాలనే నాటినట్లు తెలుస్తోంది.బీజీ3 విత్తనాలుగా చెపుతున్న పత్తి సీడ్‌కు సంబంధించి వ్యాపారుల వద్ద ఎలాంటి ఆధారం ఉండదు. కేవలం నమ్మకం పైనే కోట్ల రూపాయల దందా సాగుతోంది. సంచుల్లో విత్తనాలను తీసుకొచ్చి ఏజెంట్లుగా నియమించుకున్న రైతుల ఇళ్లల్లోకి చేరవేస్తున్నారు. అరకిలో విత్తనాలకు రూ.500 లోపు ధరతో కిలో, అరకిలో చొప్పున సదరు రైతులు విక్రయాలు సాగిస్తున్నారు. లూజుగా విక్రయించిన ఏజెంటుకు ఒక్కో కిలోకు రూ.100కు పైగానే లాభం ఉంటుంది. విత్తనాలు కొనుగోలు చేయడానికి రశీదులను ఇవ్వరు. విత్తనాల ప్యాకెట్లు బ్యాచ్ నెంబర్లు ఉండవు. వివిధ ధరలలో సంచుల్లో విక్రయిస్తారు. అందుకే వాటిని ‘లూజు విత్తనాలు’గా పేర్కొంటున్నారు.