తెలంగాణలో తెలుగుదేశంతో పొత్తుపైన కాంగ్రెస్ సంకేతాలిచ్చింది. టీడీపీతో కలిసి పోటీ చేసే ప్రతిపాదన ఉన్నట్లు ఆ పార్టీ స్పష్టం చేసింది. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే హైదరాబాద్, రంగారెడ్డిల్లో 25 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ నేతలంటున్నారు. సెటిలర్స్ ఓట్లను ఆకట్టుకునేందుకు సీమాంధ్ర ప్రాంత నేతలకు సీట్లు ఇచ్చే ఆలోచన ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు అనుహ్యాంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ ను దెబ్బతీయడానికి విపక్ష పార్టీలు ఒక తాటిపైకి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ ను గద్దె దింపాలన్న పట్టుదలతో ఉన్న పార్టీలు సిద్దాంతాలను పక్కన పెట్టేందుకు రెఢీ అవుతున్నాయి. ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ ,తెలుగుదేశం ఒక తాటిపైకి వచ్చేలా రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తనకు వ్యతిరేకంగా పుట్టిన టీడీపీతో స్నేహాం చేయడానికి కాంగ్రెస్ సై అంటోంది.ఎన్డీఎ నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశాన్ని ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా తెలంగాణలో పసుపు పార్టీని తమతో కలుపుకుపోవడానికి స్థానిక కాంగ్రెస్ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. టీడీపీతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధం గా ఉన్నామని పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంకేతాలిచ్చారు. హైదరాబాద్ ,రంగారెడ్డి జిల్లాలో తెలుగుదేశానికి ఓటు బ్యాంక్ ఉందని ఆయన అంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీకి ఓట్లు ఉన్నాయని ఉత్తమ్ స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటామన్న విషయాన్ని అధిష్టానమే నిర్ణయిస్తుందని పీసీసీ ఛీప్ చెపుతున్నారు. ఇదే సమయంలో రాజధానిలో సెటిలర్స్ ను ఆకట్టుకోవడానికి కూడా కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందు కోసం సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నాయకులను ఇక్కడి నియోజకవర్గాల నుంచి బరిలోకి దింపాలని భావిస్తోంది. ఇప్పటికే అధిష్టానం కూడా ఈ విషయంలో తమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని పీసీసీ ఛీప్ ఉత్తమ్ చెపుతున్నారు. సీమాంధ్రుల్లో కాంగ్రెస్ పైన ఉన్న కోపం పోయిందని, సెటిలర్స్ తమ వైపే ఉన్నారని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న సెటిలర్స్ నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు ఉత్తమ్ తెలిపారు. మరో వైపు మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను కాంగ్రెస్ స్విస్ చేస్తుందని పీసీసీ ఛీప్ స్పష్టం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ లో కూడా తమ పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందన్న విశ్వాశాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు....