హైద్రాబాద్: బస్సు యాత్రతో ఊపు మీదున్న తెలంగాణ కాంగ్రెస్ లోకి వలసలు ఊపందుకుంటున్నాయి. టీఆర్ఎస్ లాంటి పార్టీల నుంచి నేతలు వచ్చి చేరుతుండటం కాంగ్రెస్ కు ఉత్సాహానిస్తోంది. భవిష్యత్తులో ముఖ్యనాయకులు తమ పార్టీ కండువా కప్పుకోవడం ఖాయమని నేతలు స్పష్టం చేస్తున్నారు. మరో యేడాదిలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయ సమీకరణాలు క్రమంగా మారుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనే 2019లో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న ప్రతిపక్ష కాంగ్రెస్ అందుకు తగ్గట్లు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇప్పటికే ముప్పై ఐదుకు పైగా నియోజకవర్గాల్లో యాత్ర జరిగింది. ఎక్కడిక్కడ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తు కార్యకర్తల్లో ఉత్సాహం తెప్పించడానికి నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. బలమైన నాయకులను గుర్తించి వారికి నియోజకవర్గ బాధ్యతలను కూడా అప్పగిస్తున్నారు. బస్సు యాత్రతో తెలంగాణ మొత్తం చుట్టేయడానికి పీీసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.ఇదే సమయంలో ఇతర పార్టీ ల నుంచి నేతలను చేర్చుకోవడానికి కూడా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పైన కాంగ్రెస్ కన్నేసింది.అన్ని పార్టీల నుంచి పెద్ద ఎత్తున వచ్చి పడిన వలసలతో గులాబీ పార్టీ ఓవర్ లోడ్ అయింది. ఒక్కొక్కొ నియోజకవర్గంలో ముగ్గురు,నలుగురు ముఖ్యమైన నాయకులు టీఆర్ఎస్ లో ఉన్నారు. ఏదో ఒక గుర్తింపు కోసం ఇంత కాలం వారు కేసీఆర్ వైపు చూశారు. అయితే ఎన్నికలు సమీపిస్తుండటంతో వీరంతా ఎవరి దారి వారు చూసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ లో ఇమడలేని వారు, టిక్కెట్ వచ్చే అవకాశం లేని నాయకులు కాంగ్రెస్ వైపు చేస్తున్నారు. ఇదే సమయంలో తమ పార్టీ కి చెందిన ఒక ఎం.పితో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలను లాక్కున్న టీఆర్ఎస్ పైన ప్రతీకారం తీర్చుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం పట్టుదలగా ఉంది. అధికార పార్టీ నుంచి బలమైన నాయకులు తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ ఆరాటపడుతోంది. ఎన్నికల నాటికి భారీ ఎత్తున వలసలుంటాయని ఆ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. తాజాగా వరంగల్ తూర్పు నియోజకవర్గం టీఆర్ఎస్ నేత అచ్చ విద్యాసాగర్ కాంగ్రెస్ లో చేరారు. వరంగల్ మంచి పట్టున్న ఆయన టీఆర్ఎస్ రాజకీయాల్లో నిలబడలేక బయటకు వచ్చారు. 2009లో టీఆర్ఎస్ తరుపున వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసిన విద్యాసాగర్ కు గత ఎన్నికల్లో టిక్కెట్ రాలేదు. కాంగ్రెస్ నుంచి కొండా సురేఖ వచ్చి చేరడంతో ఆమెకు టిక్కెట్ ఇచ్చారు. ఆ తర్వాత మాజీ మంత్రి బస్వరాజు సారయ్య కూడా టీఆర్ఎస్ లో చేరడంతో విద్యాసాగర్ కాంగ్రెస్ బాట పట్టారు. విద్యాసాగర్ తరహాలోనే చాలా నియోజకవర్గాల్లో చాలా మంది టీఆర్ఎస్ నాయకులు ఊపిరి ఆడకుండా ఉన్నారని కాంగ్రెస్ చెపుతోంది. తమ దగ్గర నుంచి బలవంతంగా చేర్చుకున్న నాయకులెవ్వరు టీఆర్ఎస్ లో ఉండరని వారంటున్నారు. ఎన్నికల నాటికి అధికార పార్టీకి చెందిన ముఖ్యనేతలు కూడా గాంధీ భవన్ కు క్యూ కట్టడం ఖాయమన్నది కాంగ్రెస్ వాదన.