భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ప్రజాకోర్టులో ప్రజలే తగిన గుణపాఠం చెపుతారని అమలాపురం ఎంపీ డాక్టర్ పండుల రవీంద్రబాబు అన్నారు.తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్ధంగా శాంతియుతంగా నిరసన తెలిపిన తమను కుక్కలకన్నా హీనంగా ఈడ్చుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఆలోచన ఉన్నట్లు కనిపించడం లేదని, తెదేపా నేతృత్వంలో దాన్ని ఎలాగైనా సాధిస్తామన్నారు.భాజపాకు పోయేకాలం వచ్చిందని, పార్లమెంటులో అవిశ్వాస తీర్మానాన్ని కనీసం చర్చకు రానీయకుండా కుంటిసాకులు చూపిస్తూ ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయేలా చేసిందన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించి ఉంటే ప్రపంచానికి వాస్తవాలు తెలిసే వీలుండేదన్నారు. ఆంధ్రాకు ఏమీ ఇవ్వకూడదన్న కక్ష సాధింపు ధోరణిలో ఉన్న కేంద్ర ప్రభుత్వ తీరు అర్థంకాని ప్రశ్నగా కనిపిస్తోందన్నారు. భాజపాకు బుద్ధి చెప్పేందుకు ఎన్నికల వరకు అక్కర్లేదని, ప్రజల మనోభావాలతో ఆడుకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.