కరోనా వైరస్ వ్యాప్తి పై కొత్త విషయాన్ని వెల్లడించిన పరిశోధకులు
కరోన వ్యాప్తి కి కీలక పాత్ర పోషిస్తున్న డీ614జీ వైరస్
న్యూ ఢిల్లీ
కరోనా వైరస్ అధ్యయనంపై పరిశోధకులు కొత్త విషయాన్ని వెల్లడించారు. సార్స్‌సీవోవీ2 వైరస్ వ్యాప్తిలో కొత్త రకం జన్యువు కలిగిన వైరస్ దూసుకువెళ్తున్నట్లు చెప్పారు. డీ614జీ వైరస్ రకం ఎక్కువ శాతం కేసుల్లో కనిపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. కరోనా మహమ్మారిగా మారడంలో ఈ రకం కీలక పాత్ర పోషిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. సెల్ జర్నల్‌లో దీనికి సంబంధించిన నివేదికను ప్రచురించారు. అమెరికాకు చెందిన లాస్ అలమోస్ నేషనల్ ల్యాబరేటరీ బయోలజిస్ట్ బెట్టర్ కార్బర్.. కరోనా వైరస్ కొత్త వేరియంట్‌పై స్టడీ చేశారు.కోవిడ్19 శరవేగంగా వ్యాప్తి కావడానికి డీ614జీ రకమే కారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ రకమైన జన్యువు ఉన్న వైరస్‌కు సంక్రమణ రేటు అధికంగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. డీ614జీ రకం.. వైరస్‌లో స్పైక్ ప్రోటీన్‌లో మార్పు చేసి.. అది మానవ శరీరంలోకి త్వరగా చొచ్చుకు వెళ్లేవిధంగా మారుస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. డీ614జీ వైరస్ జన్యువును ఏప్రిల్ ఆరంభంలో గుర్తించినట్లు కార్బర్ తెలిపారు. ప్రారంభంలో సార్స్ సీవోవీ-2 రకం వైరస్ ఎక్కువగా ఉన్నా... ఆ తర్వాత కాలంలో డీ614జీ రకం మాత్రం శరవేగంగా వ్యాప్తి చెందినట్లు కార్‌నర్ తన స్టడీలో పేర్కొన్నారు. పరివర్తన చెందిన ఈ రకమైన వైరసే ఇప్పుడు అంతటా వ్యాపిస్తున్నట్లు పరిశోధకులు అంచనాకు వచ్చారు. ఈ కొత్త రకమైన వైరస్ వేరియంట్.. అన్ని భౌగోళిక ప్రదేశాల్లో దర్శనమిస్తున్నట్లు తేల్చారు. నగరాలు, పట్టణాలు, మున్సిపాల్టీల్లోనూ కొత్త రకం వైరస్ ఛాయలు కనిపిస్తున్నట్లు చెప్పారు. మార్చి ఒకటవ తేదీ కన్నా ముందు డీ614 రకం వైరస్ యూరోప్ బయట కనబడలేదు. కానీ ఆ నెల చివరలోగా ఈ కొత్త తరహా వైరస్ జన్యువు ఎక్కువగా కనిపించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డీ614జీ వైరస్ వ్యాప్తికి కారణాలను కూడా వెల్లడించారు. మానవ శరీరంలోని శ్వాసకోస నాళంలో చాలా వేగంగా ఈ వైరస్ జన్యువు రెట్టింపు అవుతున్నట్లు గుర్తించారు. కానీ మనుషుల్లో మాత్రం ఆ వైరస్ ప్రాణాంతకంగా మారడం లేదన్నారు. ఏప్రిల్ నెల వరకే సార్స్ సీవోవీ2కు చెందిన 14 రకాల వైరస్ జన్యువులను గుర్తించినట్లు బ్రిటన్, అమెరికా పరిశోధకులు తెలిపారు.