ఎక్కడెక్కడ రామకథ చెప్పబడుతుందో అక్కడక్కడ స్వామి హనుమ అందరి కన్నా ముందు వచ్చి కుర్చుంటారు.
ఎక్కడెక్కడ రామ కథ చెప్పడం పూర్తవుతుందో అక్కడ అందరి కన్నా చిట్ట చివర్న బాధపడుతూ, వెనక్కి తిరిగి చూస్తూ వెళ్తారు.
అందుకే, ప్రత్యేకించి సుందరకాండ ఎక్కడ చెప్పబడుతుందో అక్కడకి హనుమ వస్తారు అని అంటారు. కారణం ఏమంటే శ్రీ రామాయణం లో - మిగిలిన ఏ కాండలోనూ లేని అద్భుతం ఒక్క సుందరకాండలోనే వుంది.
సుందర కాండలో రామ కథ ఒకటికి పదిమార్లు చెప్పబడుతుంది.హనుమ చెప్పేటప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎంత రామకథ చెప్పాలో అంతనే చెబుతారు.
రామకథ కున్న బలమేమిటో, రామ నామానికున్న బలమేమిటో నిరూపించిన కాండ సుందరాకాండ! అందుకే సుందరాకాండ బహుభంగిమల సుందరకాండ.
ఎన్ని కోణాలలో చూడండీ, అదంతా సుందరమే!
ఒక పాత్ర నిండా పాయసం తీసుకొచ్చి అక్కడ పెడితే, అడుగున వున్నది పాయసమా, మధ్యన వున్నది పాయసమా, పైనున్నది పాయసమా అని అడిగితే ఏం చెప్పవలసి వుంటుంది? - అంతా పాయసమే. - అలాగే, సుందరాకాండ ని ఎటు వైపునించి చూడండి అంతా సౌందర్యమే.
రామాయణం లో ఒక్క సుందరకాండకొచ్చేసరికి, మహర్షి ఒక గొప్ప ప్రయోగం చేసారు. ఇందులో చాలా శ్లోకములు శ్లోకములు కావు. చాలా శ్లోకములు మంత్రములే.
అందుచేతనే, అప్పటికీ ఇప్పటికీ సుందరకాండ శక్తి ఏమిటంటే,
పిల్ల పెళ్ళవలేదు! - సుందరకాండ చదువుకోండి.
పిల్లాడికి ఉద్యోగం రాలేదు - సుందరకాండ చదువుకోండి.
ఆరోగ్యం బాలేదు - సుందరకాండ చదువుకోండి.
ఏమిటో భయంగా వుంటోంది - సుందరకాండ చదువుకోండి.
భీతి కలిగింది - సుందరకాండ చదువుకోండి.
ఏ కష్టం కలగనీండి - సుందరకాండ చదువుకోండి ఫలితం వుంటుందని నమ్ముతారు భక్తులు. ఎందుకనంటే - లోకం లో ఇంత శక్తిమంతమైనవి రెండే రెండు సాహిత్యం లో వున్నాయని చెబుతారు పెద్దలు. ఈ రెండూ కాకుండా మూడో అంకె వేసి చెప్పడానికి ఇంక లేదు. ఆ రెండూ ఏమిటంటే ఒకటి సుందరకాండ, రెండు - సౌందర్య లహరి. మూడు ఇక లేదు. రెండూ సౌందర్యము, సుందరము ఆ పర్యాయ పదాలతోటే వుంటాయి.
రామానుగ్రహాన్ని ప్రసాదించే శక్తి సుందరకాండలో వుంది.
-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు.