అందరితో కలిసిపోయి, ఆడుతూ పాడుతూ చిన్నపిల్లల్లా జీవితం గడపాలని చాలామంది జీవితానుభవం కలిగినవారికి ఉంటుంది. అది మనసు వరకే. ఆలోచనల్లోనే. ప్రవర్తనలోకి రాదు. కొద్ది కొద్ది మార్పులు కూడా ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. మనకే అనిపిస్తూ ఉంటుంది. మనం ఇంకొంచెం మెరుగ్గా వాళ్లతో ప్రవర్తించి ఉండాల్సిందని. కాని ఎందుకో అంతకు మించి సాగలేకపోయాం. అదేమంత కష్టం కాదు. అయినా, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే లాగా ఉండిపోయాం. ఎన్నో పుస్తకాలు చదువుతాం. వీలైతే పెద్దవాళ్ల మాటలు సభల్లో వింటాం. గొప్ప గొప్ప చలనచిత్రాలు చూస్తాం. ఇంట్లోనే అనుకోని ఒక సందర్భం ఎదురుపడినప్పుడు పదేళ్ల క్రితం ఎలా ప్రవర్తించామో ఇప్పుడూ అలానే ప్రవర్తిస్తుంటాం. శరీరంలో మార్పులు కనిపిస్తుంటాయి. కాని, మనసులో పెద్దగా మార్పులు రావు. మనసులో మార్పు ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. అంతర్గతంగా వచ్చే మార్పే జీవితాన్ని సమూలంగా మార్చేస్తుంది. మారకుండా ఉండే ఏ పరిస్థితీ మానవ జీవితంలో లేదు. అసలు ప్రకృతిలోనే లేదు. మార్పు నిత్యసత్యం. ఈ సత్యం తెలుసుకున్న మనిషి అందరికీ అనుకూలంగా ఉంటాడు. ఒకరిద్దరికి మించి, మన ప్రవర్తనలో మార్పు ఉండాలి అన్నారంటే, మనల్ని మనం పరిశీలించుకోవాలి. అద్దం ముందు పెట్టుకుని మన శరీరాన్నే కాదు, మనసును సైతం అన్ని కోణాల్లోంచీ శోధించాలి. మన ప్రవర్తన సరిగ్గా లేనప్పుడే, ఎదుటివాళ్లను ఎవరిని చూసినా ఏదో వంక పెట్టాలని అనిపిస్తుంది. వాళ్లెవరూ సరిగ్గాలేరని అనిపిస్తుంది. ఒక్కక్షణం చాలు. మనం మారితే... ప్రపంచం మారిపోతుంది! ధర్మరాజు దృష్టి కోణంలో అందరూ మంచివారే. దుర్యోధనుడి దృష్టి కోణంలో అందరూ చెడ్డవారే. చూపు మార్చుకుని, ప్రవర్తనలో ఆ మంచి విషయాలను అభ్యాసం చెయ్యాలి. మారిన మనిషిని చూస్తే, ప్రతి ఒక్కరికీ విస్మయమే. ఎందుకంటే మార్పు కష్టం. మార్పును అంగీకరించి తన ప్రవర్తన మార్చుకుని ఎదుటివాళ్లకు అనుకూలంగా ఉండాలంటే, అతడెంతో సంయమనంతో ఉండాలి. పాత అలవాట్లను అధిగమించాలి. ముఖ్యంగా జీవితాన్ని యథాతథంగా స్వీకరించాలి. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధ సందర్భంగా అర్జునుడిలో పెను మార్పులు తీసుకొచ్చాడు. లోకకల్యాణ కారకమైన భగవద్గీతనే అందించాడు. దైవం తలచుకుంటే మార్పును ఇవ్వడమే కాదు, కొత్త జన్మనే ప్రసాదించగలడు. ముఖ్యంగా మన ప్రవర్తనను అద్భుతంగా నియంత్రించగలిగేది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత రవ్వంత కూడా తెలియని మనుషులూ మంచివారుగా మెలగవచ్ఛు మంచివారుగా ఉండాలంటే వారు హృదయంతో జీవించాలి. ఆ హృదయంలో ఆత్మ ఆసీనురాలై ఉంది. ఆత్మను స్పృశిస్తే ఆధ్యాత్మికత పెల్లుబుకుతుంది. ‘అన్ని వైపుల నుంచి దివ్యమైన ఆలోచనలు రావాలి’ అని రుగ్వేదం చెబుతోంది. సహజంగా మన లోపల పుట్టే ఆలోచనలన్నీ సానుకూలంగా ఉండవు సరికదా- మంచిగానూ ఉండవు. కొన్ని మనసులు ఆలోచించినట్లు శత్రువులైనా ఆలోచించరు. అందుకే మనకు దివ్యమైన భావాలు కావాలి. ఎక్కడ అగ్ని ఉందో, అక్కడే నీటిని చల్లాలి. పుట్టే చెడ్డ ఆలోచనలను వెనువెంటనే మంచి ఆలోచనలతో ఖండించాలి. మాటలో, ప్రవర్తనలో సైతం గొప్పదనాన్ని, దివ్యత్వాన్ని ప్రకటించాలి. త్వరగా మనలో రావాల్సినంత మార్పు రాకపోతే అంత నష్టం జరిగిపోయినట్లే. కాలం తిరిగి రాదు. చింతించి లాభం లేదు. సమస్యను గుర్తించిన మరుక్షణమే మనసును మార్చుకొని ముందుకెళ్లాలి. వాళ్లవాళ్ల ప్రవర్తనలో మార్పుల వల్లనే సంఘ సంస్కర్తలు, దేశభక్తులు, శాస్త్రవేత్తలు, యోగులు, జ్ఞానులు... చరిత్రలో నిలిచిపోయారు. వేల సంవత్సరాల నుంచి భూమిలో నిక్షిప్తమై పడిఉన్న బొగ్గుముక్కే ఒక రోజు వజ్రంగా సాక్షాత్కరిస్తుంది. ఇది శాస్త్రీయ పద్ధతిలో కనిపించే ఒక సత్యం. మనం మారదాం. మన కోసం, అందరి కోసం!