నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ ఏడాది అక్టోబర్‌లో చంద్రయాన్-2ను ప్రయోగించనున్నట్లు ఇస్రో ఛైర్మన్ శివన్ తెలిపారు.నెల్లూరుజిల్లా శ్రీహరికోటలో పీఎస్‌ఎల్వీ ప్రయోగం విజయవంతం అయిన సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రయాన్-2 ప్రయోగంలో ల్యాండర్, రోవర్, ఆర్బిటార్‌లను పంపనున్నట్లు తెలిపారు. వీటికి సంబంధించి పరిశోధనలు జరుతున్నాయని ఆయన వివరించారు. చంద్రయాన్-2 జీఎస్‌ఎల్వీ ద్వారా పంపనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది జీఎస్‌ఎల్వీ-మార్క్3డీ2, జీఎస్‌ఎల్వీ-మార్క్2, మూడు పీఎస్‌ఎల్వీ ప్రయోగాలను చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇస్రో మొట్టమొదటి సారిగా 5.7 టన్నుల బాడీ సామర్థ్యంగల జీశాట్-11 ఉపగ్రహాన్ని త్వరలో ఫ్రెంచ్ గయానాలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పంపనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఉపగ్రహం ద్వారా హైస్పీడ్ ఇంటర్‌నెట్ సదూపాయం అందుబాటులోకి రానున్నట్లు వివరించారు.పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహం ద్వారా నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి రానుందని వివరించారు. నావిగేషన్ వ్యవస్థకోసం ఇప్పటివరకూ ఎనిమిది ఉపగ్రహాలు పంపామని పేర్కొన్నారు. గతేడాది ఆగస్టు 31న పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1హెచ్ ఉపగ్రహం విఫలమైందని తెలిపారు. దాని స్థానంలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహాన్ని పంపినట్లు పేర్కొన్నారు. ఇటీవలే ప్రయోగించిన ఇస్రోతో అనుసంధానం కోల్పోయిన జీశాట్6ఏ ఉపగ్రహం ఏ కక్ష్యలో ఉందో కనుగొన్నామని తెలిపారు.