విజయవాడ, జూలై 6,
సమాజ ప్రయోజనాలు, సమూహ ప్రయోజనాలు, సామాజిక ప్రయోజనాలు, సామాజిక వర్గ ప్రయోజనాలు… చూడ్డానికి అన్నీ ఒకేలా ఉండే పదాలే కానీ వాటి అర్థాలు, అన్వయాలు, సందర్భాలు వేరు వేరుగా ఉంటాయి. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రాజధాని గ్రామాల్లో, ముఖ్యంగా కోర్ క్యాపిటల్ ఉన్న గ్రామాల్లో ఈ ఆందోళనలు ఎక్కువగా జరుగుతున్నాయి. 29 గ్రామాల్లో 34వేల ఎకరాల భూమిని రైతులు త్యాగం చేసి రాజధాని కోసం ఇచ్చినందున రాజధాని తరలింపు అవసరం లేదని, అమరావతిలోనే దానిని కొనసాగించాలని రాజధాని ప్రాంతం రైతులతో పాటు ప్రతిపక్షాల వాదన. దీని కోసం 200రోజులుగా ఆందోళనలు, దీక్షలు, ధర్నాలు చేస్తున్నారు. లాక్ డౌన్ లో కూడా వారి పోరాటం కొనసాగుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ వార్తలు ప్రత్యేకించి రెండు తెలుగు దిన పత్రికల్లో ఒక్కరోజు కూడా మర్చిపోకుండా ఏదొక పేజీలో చోటు కల్పిస్తున్నారు.రాజధాని మీద ఈ పత్రికలకు, టీవీలకు ఉన్న ఆసక్తి, అభిమానం సమాజ ప్రయోజనంలో భాగమా? సమూహ ప్రయోజనాల, సామాజిక ప్రయోజనాలా, సామాజిక వర్గ ప్రయోజనాలా అన్నది అసలు ప్రశ్న. రాజధాని తరలింపుతో చాలా మంది నష్టపోతారు. ఆ మాటకొస్తే 29 గ్రామాల కంటే ఎక్కువగా ఇప్పటికే అభివృద్ధి చెందిన విజయవాడ -గుంటూరు మధ్య ఉన్న నివాస ప్రాంతాలకు నష్టం వాటిల్లింది. భూముల ధరలు తగ్గి కొనే వారు లేక నిర్మాణ రంగం కొనుకోలేని నష్టాలు ఎదుర్కొంటోంది. కేవలం ప్రభుత్వానికి భూమిని ఇవ్వడం ద్వారా మాత్రమే లాభాలు కోల్పోయిన వారితో పోలిస్తే., నిర్మాణ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారి నష్టం ఎక్కువ. అయితే ఆ నష్టం రాష్ట్రం మొత్తానికి వర్తిస్తుందా అన్నది ప్రశ్న. క్రమంగా జరిగే పట్టణీకరణలో వీటికి కొద్ది రోజుల తర్వాత అయినా భవిష్యత్తు ఉండొచ్చు.ఇక 200రోజులుగా విరామం లేకుండా రాజధాని ఉద్యమాన్ని నడిపిస్తున్న చోదక శక్తి ప్రసార మాధ్యమలే. రాజధాని రైతుల త్యాగాలు, వారి కన్నీళ్లు ఏకబిగిన అక్షరాలుగా పత్రికలు, టీవీలలో రోజు కనిపిస్తున్నాయి. రాజధాని అందరిది, అందులో అన్ని వర్గాల ప్రజలు భూములు ఇచ్చారు, నష్ట పోయే వారిలో దళితులు కూడా ఉన్నారు అనేది ఈ కథనాల్లో అంతర్లీనంగా కనిపించే వాదన. నిజమే 2014డిసెంబర్ లో రాజధాని ప్రకటన చేయకముందు రాజధాని గ్రామాల్లో భూములు పై కులాలవి అయితే ఉపాధి కింద కులాల వారిది. ఏడాది పొడుగునా సాగే వ్యవసాయంలో వారికి ఉపాధి దొరికేది. రాజధాని నిర్మాణంలో ఉన్న అర ఎకరా, పావు ఎకరా రైతులు కూడా బలవంతంగానో, బెదిరింపులకో భూమి వదులుకున్నారు.వారి వాటా భూములు కొన్ని ఇప్పటికే చేతులు మారిపోయాయి. అసలు మొత్తం 34వేల ఎకరాల్లో రాజధానికి భూములు ఇచ్చిన దళితులు, వెనుక బడిన కులాలు ఎందరు, వారు ప్రభుత్వానికి ఇచ్చిన భూమి ఎంత, వచ్చిన పరిహారం ఎంత అన్నది ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు. ఆ గుట్టు విప్పితే రాజధాని చిక్కుముడి విడిపోతుంది. పత్రికల ఆసక్తి ఏమిటో అర్థం అవుతుంది. కథనాల వెనుక కుట్రలు తెలిపోతాయి. ఈ ఉద్యమాలు, పోరాటాలు, మొదటి పేజీ కథనాల వెనుక దాగి ఉన్న రహస్యం అదే…. ఈ కథనాల వెనుక ఉన్నది సమాజ ప్రయోజనాలో, సమూహ ప్రయోజనాలో, సామాజిక ప్రయోజనమో, సామాజిక వర్గ ప్రయోజనమో తేలిపోతుంది.