గుంటూరు, జూలై 6,
టీడీపీకి ఉన్న ముగ్గురు ఎంపీల్లో గుంటూరు నుంచి వరుసగా విజయం సాధించారు గల్లా జయదేవ్. అయితే, ఇప్పటికి ఆయన రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించి ఏడాది పూర్తయింది. ఈ ఏడాది కాలంలో నియోజకవర్గంలో ఆయన దూకుడుగానే ఉన్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం నియోజకవర్గంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందట.. ఈ విషయం టీడీపీలోనే చర్చనీయాంశంగా మారింది. రాజధాని విషయంలో దూకుడుగా వ్యవహరించారు గల్లా జయదేవ్. అసెంబ్లీ ముట్టడికి రాజధాని రైతులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించి పోలీసుల కన్నుగప్పి అసెంబ్లీ వరకు వెళ్లారు. ఈ క్రమంలో అరెస్టు కూడా అయి ఒక రోజంతా జిల్లా జైల్లో గడిపారు. దీనిని టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు.గల్లా జయదేవ్ దూకుడు భేష్ అంటూ.. పార్టీ అధినే త చంద్రబాబు సైతం అనేక సందర్భాల్లో ప్రస్తుతించారు. పార్లమెంటులోనూ రాష్ట్ర సమస్యలపై గల్లా దూకుడుగా ఉన్నారని, పార్లమెంటులో ప్రత్యేకహోదా సహా అనేక రాష్ట్ర అంశాలపై కేంద్రాన్ని నిలదీశారని చంద్రబాబు గొప్పగా చెప్పుకొన్నారు. అయితే, బయట ఎంత దూకుడుగా ఉన్నప్పటికీ.. ఇంట్లో ఈగల మోత మాదిరిగా ఉందట ఎంపీ గల్లా జయదేవ్ వ్యవహారం. ఏడాది పూర్తయినా ప్రజలకు అందుబాటులో ఉండలేక పోతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. కొన్నాళ్ల కిందట ఎంపీ కార్యాలయం ముందు స్థానికులు ఆందోళన చేశారు. దీంతో ఈ విషయం చంద్రబాబుకు కూడా చేరింది.ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎంపీ గల్లా జయదేవ్ కు కొన్ని సూచనలు చేశారట. వారంలో మూడు రోజులైనా.. నియోజకవర్గంలో ఉండాలని, ప్రజల సమస్యలు పట్టించుకోవలాని ఆయన కోరారట. దీనికి ఎంపీగారు అప్పట్లో ఓకే అన్నారు. ఓ రెండు నెలలపాటు అలాగే వ్యవహరించారు. ఈ క్రమంలోనే రాజధాని గ్రామాల్లో పర్యటించి.. ఆందోళనలకు మద్దతు కూడా పలికారు. ఇక, ఆ తర్వాత కరోనా నేపథ్యంలోలాక్‌డౌన్ విధించడంతో గల్లా జయదేవ్ హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. అక్కడే ఉంటున్నారు. కొన్నిరోజుల కిందట ఢిల్లీ వెళ్లారు. అంతే తప్ప.. లాక్‌డౌన్ సమయంలో నియోజకవర్గంలో తమకు అందుబాటులో లేరని, తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని తాజాగా మళ్లీ టీడీపీ ఆఫీస్ ముందు కొందరు ఆందోళనకు దిగారు.దీంతో పరిస్థితిని చక్కదిద్ది.. ఎంపీ త్వరలోనే వస్తారని సర్దిచెప్పారట. కానీ, ఇంత జరిగినా.. ఎంపీ గల్లా జయదేవ్ ప్రజలకు మాత్రం సమాధానం చెప్పలేదని అంటున్నారు. మరి ఇలా అయితే.. స్థానికంగాఆయన డెవలప్‌మెంట్‌పై ఎలా దృష్టి పెడతారు? అనేది సమస్య. ఇక ఈయన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే మద్దాలి గిరి సైతం పార్టీ మారిపోయారు. ఇలాంటి టైంలో రాజధాని మార్పు నేపథ్యంలో అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత క్యాష్ చేసుకుని పార్టీ పటిష్టతకు కృషి చేయాల్సిన గల్లా జయదేవ్ అవేం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్టే కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లు ఉంది కాబట్టి.. అప్పటి వరకు తాను తన వ్యాపారం చూసుకుంటే చాలనే ధోరణిలో ఉన్నారా ? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.