జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏటా నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించడంలో అధికారులు విఫలమవుతున్నారు. శాఖల నడుమ కొరవడిన సమన్వయ లోపంతో అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించలేకపోతున్నారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించటానికి ఏడాది పొడవునా పనులు చేపడుతూ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు లక్ష్యాన్ని అధిగమించలేకపోతున్నారు. పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించినా స్థానిక సంస్థల సహకారం కొరవడింది. కనీసం ఈ ఆర్థిక సంవత్సరంలో అయినా నిర్దేశించిన లక్ష్యాలను అధిగమిస్తూ వ్యవసాయ కూలీలకు ఉపాధి భరోసా కల్పించటానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది.
2018-19 ఆర్థిక సంవత్సరంలో అధికారులు భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. దాదాపు 48 అంశాలకు సంబంధించిన పనులు చేపట్టాలని భావించి వ్యక్తిగత పంట నూర్పిడి ఫ్లాట్ ఫారం, బావుల తవ్వకం, కొండ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించటం, మొక్కలు నాటడం, కాఫీ మొక్కలు నాటడం మినహా మిగిలిన అంశాల్లో చేపట్టే పనులకు సంబంధించి అంచనాలు రూపొందించగా పరిపాలన పరమైన ఆమోదం లభించింది. పంట వ్యవసాయ భూముల పంట కాలువలు, సరిహద్దు కందకాలు, చెక్‌డ్యాంలు, కుంటల మరమ్మతులు, శ్మశానవాటికలు, కట్టలు పటిష్ఠపర్చటం, నీటికుంటలు, నాడెప్ కంపోస్టు యూనిట్లు, ఇంకుడు గుంతలు, కాలువలు, మొక్కలు నాటడం, పశువుల తొట్టెల నిర్మాణం వంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు తయారు చేసిన అంచనాల నివేదిక ఆధారంగా కూలీలకు 51.17 లక్షల పనిదినాలు ఉపాధి కల్పించటానికి 18,224 పనులకు పరిపాలనా ఆమోదం లభించింది. కూలీల వేతనం నిమిత్తం రూ.103.61 కోట్లు, సామగ్రి పనులకు రూ.15.14 కోట్లకు ఆమోదం లభించింది. ప్రస్తుతం తయారు చేస్తున్న అంచనాలకు ఆమోదం లభిస్తే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో నిర్దేశించుకున్న పనుల లక్ష్యం అధిగమించే దిశగా చర్యలు చేపడితే వ్యక్తిగత, ఉమ్మడి ప్రయోజనాల ఫలాలు పొందటానికి అవకాశం ఉంది. తద్వారా ఉపాధి హామీ పథకం ఆశయం నెరవేరుతుంది.
క్షేత్రస్థాయిలో వ్యక్తిగత, ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని స్థిరాస్తుల కల్పన పనుల్లో సైతం నాణ్యత కొరవడింది. పంట సంజీవని పథకంలో భాగంగా 12 వేల నీటికుంటల తవ్వకం లక్ష్యానికి 9,920 పనులు చేపట్టి రూ.16.28 కోట్లు ఖర్చు చేశారు. శ్మశానవాటికలను అభివృద్ధి చేయటానికి 100 పనుల్లో ఆరు మాత్రమే పూర్తి చేయగా 307 పనులు పురోగతిలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. క్రీడా మైదానాల అభివృద్ధి నిమిత్తం చేపట్టిన 80 పనుల్లో ఎనిమిదింటినే పూర్తి చేయగా 204 పనులు పురోగతిలో ఉన్నాయి. కంపోస్టు పిట్ల నిర్మాణం 5,500 లక్ష్యంగా నిర్ణయించుకుని 4,437 పనులు పూర్తి చేశారు. ఘనవ్యర్థ పదార్థాల నిర్వహణ కింద 300 పనుల్లో 48 మాత్రమే పూర్తి చేశారు. ఎన్టీఆర్ జలసిరిలో 1500 బోరుబావులు తవ్వాలనుకున్నా 530 మాత్రమే డ్రిల్లింగ్ పూర్తి చేసి 216 బోర్లకు సౌర పంపుసెట్లను ఏర్పాటు చేశారు.
ఉపాధి హామీ పథకంలో ప్రతిభ చూపిన పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. లక్ష్యాలను అధిగమించిన పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది. నూరుశాతం మరుగుదొడ్లు పూర్తి చేసిన పంచాయతీలకు రూ.5 లక్షలు, వంద నీటి కుంటలు పూర్తి చేస్తే రూ.4 లక్షలు, నివాసగృహాల్లో పూర్తిస్థాయిలో ఇంకుడు గుంతలు తవ్వితే రూ.2 లక్షలు, నాడెప్, వర్మీ కంపోస్టు యూనిట్లు 50 పూర్తి చేస్తే రూ.2 లక్షలు, రహదారికి ఇరువైపులా మూడు కిలోమీటర్ల మేరకు 1200 మొక్కలు నాటి సంరక్షిస్తే రూ.2 లక్షలు, నాలుగు ప్రభుత్వ సంస్థల్లో మొక్కల పెంపకం నూరు శాతం పూర్తి చేస్తే రూ.2 లక్షలు, ఈ ఆరు అంశాల్లో నాలుగు అంశాల్లో అధిగమిస్తే అదనపు ప్రోత్సాహకంగా రూ.5 లక్షలు చొప్పున ప్రభుత్వం మంజూరు చేస్తోంది. ఈ అంశాలన్ని పూర్తి చేసిన పంచాయతీలు గరిష్ఠంగా రూ.22 లక్షలు, ఒక్కో జిల్లాకు గరిష్ఠంగా రూ.11 కోట్లు వరకు రాబట్టేందుకు అవకాశం ఉంది. లక్ష్యాలను అధిగమించే దిశగా స్థానిక సంస్థలు మాత్రం దృష్టిసారించడం లేదు. యంత్రాంగానికి సైతం సరైన సహకారం కొరవడుతోంది. ఫలితంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుకోలేకపోతున్నారు.