న్యూఢిల్లీ, జూలై 6,
చైనా యాప్‌ల నిషేధం, చైనా వస్తువుల వినియోగంపై భారతీయుల స్వచ్చంద కట్టడి తీవ్రస్థాయిలో ఉండటంతో చైనా ఉత్పత్తి, సేవా సంస్థలు కొత్త రాగం ఆలపిస్తున్నాయి. దేశాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నా తాము మాత్రం మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తికే కట్టుబడి ఉంటామని, భారత్ సమగ్ర దీర్ఘకాలిక వృద్ధి సాధనలో తమ వంతు పాత్ర పోషిస్తామని చైనా కంపెనీలు భరోసా నిస్తున్నాయి. ఇక టిక్ టాక్ అయితే ప్రభుత్వ నిషేధాన్ని "తాత్కాలిక ఉత్తర్వు"గా భావిస్తున్నామని, ప్రభుత్వంతో చర్చల ద్వారా తాజాగా ఏర్పడిన సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
దేశంలో చైనా వ్యతిరేక సెంటిమెంట్ తీవ్రంగా పెరగడంతో చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ కీలక విషయాన్ని వెల్లడించింది. మేక్ ఇన్ ఇండియా విధానానికి తాము కట్టుబడి ఉన్నామని శుక్రవారం ప్రకటించింది. మేక్ ఇన్ ఇండియా వ్యూహంలో సమగ్ర, దీర్ఘకాలిక వృద్ధిని సాధించడానికి కట్టుబడి ఉన్నామని వన్‌ప్లస్ టాప్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే భారతదేశంలో టీవీల తయారీని కంపెనీ ప్రారంభించామన్నారు. అలాగే ఈ వారంలో తొలి బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ నార్డ్‌ను భారత్, యూరప్‌లో లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు.
2014లో ప్రవేశించినప్పటి నుండి భారతదేశం వన్‌ప్లస్‌కు కీలకమైన మార్కెట్‌గా కొనసాగుతోందనీ, 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు అనుగుణంగా ఉత్పాదక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి చాలా కష్టపడ్డామని వన్‌ప్లస్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ నవ్నిత్ నక్రా చెప్పారు. దేశంలో వన్‌ప్లస్ టీవీల తయారీని మొదలు పెట్టామని, గత సంవత్సరం హైదరాబాద్‌లో ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని ప్రారంభించామని వెల్లడించారు. రాబోయే మూడేళ్లలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడికి కట్టుబడి ఉన్నామని నక్రా చెప్పారు.
ఈ కేంద్రంలోని కెమెరా ల్యాబ్, కమ్యూనికేషన్స్, నెట్‌వర్కింగ్ ల్యాబ్‌లు ఆటోమేషన్ ల్యాబ్‌ల కనుగుణంగా కెమెరా, ఆటోమేషన్, నెట్‌వర్కింగ్, కనెక్టివిటీ ఫ్యూచర్ టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి పెడుతుందన్నారు. ప్రధానంగా 5 జీ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి ఉంటుందన్నారు. దేశంలో 5 వేలకు పైగా ఆఫ్‌లైన్ స్టోర్స్‌ను ఉండగా, త్వరలోనే ఈ సంఖ్యను 8000 దాటాలనే ప్రణాళికలో ఉన్నామని వివరించారు. వన్‌ప్లస్ 2018 ఫిబ్రవరి నుండి భారతదేశంలో తన ఉత‍్పత్తులను తయారు చేస్తోంది. ప్రీమియం హ్యాండ్‌సెట్ తయారీదారు గురువారం అద్భుతమైన ఫీచర్లతో వన్‌ప్లస్ టీవీ యు, వై సిరీస్‌ను కంపెనీ గురువారం విడుదల చేసింది. కాగా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా చైనాకు చెందిన అనేక కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టాయి. అయితే లద్దాఖ్ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా సమస్యల రీత్యా, టిక్‌టాక్, వీచాట్, యూసీ బ్రౌజర్ సహా 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించిన సంగతి తెలిసిందే.ఇండో-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, సైబర్ దాడి ముప్పు ఉందన్న అంచనాల మధ్య చైనాకు చెందిన టిక్‌టాక్ సహా 59 యాప్ లను నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో టిక్‌టాక్ తన వినియోగదారుల డేటాను చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వానికి ఇవ్వలేదని, భవిష్యత్తులో కూడా అలా చేయబోమని వివరణ ఇచ్చింది. భారత చట్టాల ప్రకారం, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలన్నీ పాటిస్తున్నామంటూ టిక్‌టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఆహ్వానం అందిందని చెప్పారు. దీనిపై మరింత స్పష్టత ఇచ్చేందుకు, చర్చించడంతోపాటు, సందేహాలను నివృత్తి చేస్తామన్నారు. వినియోగదారు గోప్యతకు, సమగ్రతకే అధిక ప్రాముఖ్యత అన్నారు. ప్రభుత్వ నిషేధాన్ని "తాత్కాలిక ఉత్తర్వు" గా అభివర్ణించించిన గాంధీ 14 భారతీయ భాషలలో లక్షలాదిమందికి ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని, వినియోగదారులు, కళాకారులు, స్టోరీ టెల్లర్స్, విద్యావేత్తలు సహా ఎంతోమందికి జీవనోపాధిని అందిస్తున్నామని వెల్లడించారు. వీరిలో చాలామంది మొదటిసారి ఇంటర్నెట్ వినియోగదారులే అన్నారు. ప్రభుత్వంతో చర్చల ద్వారా ఈ సమస్య పరిష్కారమవుతుందనే విశ్వసిస్తున్నట్లు తెలిపారు.