న్యూఢిల్లీ, జూలై 6,
దేశంలో కరోనా వైరస్ మరింత ఉద్ధృతంగా ఉంది. ప్రస్తుతం అత్యధికంగా కరోనా వైరస్ కేసులు నమోదయిన దేశాల జాబితాలో భారత్ మూడో స్థానానికి చేరింది. ఇప్పటి వరకూ మూడో స్థానంలో ఉన్న రష్యా (681,251)ను వెనక్కునెట్టింది. తొలి రెండు స్థానాల్లో అమెరికా (30లక్షలు), బ్రెజిల్ (16 లక్షలు) కొనసాగుతున్నాయి. కేవలం ఐదు రోజుల్లోనే పాజిటివ్ కేసులు లక్షకుపైగా నమోదయ్యాయి. పాజిటివ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతుండగా.. ఆదివారం సుమారు 25వేల మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. దేశవ్యాప్తంగా మరో 421 మంది కరోనాతో చనిపోయారు.ఐదు రోజుల్లోనే 2,300 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 6,97,877కి చేరగా.. మరణాలు 19,700కి చేరాయి. కరోనా నుంచి 4.24 లక్షల మంది కోలుకోగా.. మరో 2.54 లక్షల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా 24,912 కేసులు నమోదయ్యాయి. జులై 2 నుంచి నాలుగు రోజులుగా రోజువారీ కేసుల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రోజువారీ కేసుల్లో తొలిసారి అసోం, ఉత్తరప్రదేశ్‌లో 1,000కిపైగా నిర్ధారణ అయ్యాయి. ఎప్పటిలాగే మహారాష్ట్రలో అత్యధికంగా 6,555కుపైగా కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 206,619కి చేరాయి. మరో 151 మంది ప్రాణాలు కోల్పోవడంతో మహారాష్ట్రలో కరోనా మరణాలు 8,856కి చేరాయి. కర్ణాటక (1,925), ఆంధ్రప్రదేశ్ (998), బెంగాల్ (895), గుజరాత్ (725), రాజస్థాన్ (632)లోనూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నిర్ధారణ కావడం గమనార్హం. యూపీలో 1,155 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. మొత్తం కేసులు 28వేలు దాటాయి. యూపీలో 75 జిల్లాలు ఉండగా.. 26 చోట్ల రెట్టింపు కేసులు బయటపడ్డాయి. తమిళనాడులో ఆదివారం అక్కడ 41,50 కేసులు నమోదయ్యాయి. వరుసగా రెండో రోజు పాజిటివ్ కేసుల సంఖ్య చెన్నై నగరంలో నమోదయినా.. సమీపంలోని జిల్లాల్లో మాత్రం పెరుగుతున్నాయి. కాంచీపురం (152), తిరువల్లూరు (209), చెంగల్పట్టు (274) కేసులు బయటపడ్డాయి.ఏపీలో కరోనా కేసులు ఒక్కరోజులోనే వేయికి చేరువయ్యాయి. ఆదివారం కొత్తగా 998 కేసులు నమోదు కాగా.. 14 మంది మరణించారు. 24 గంటల వ్యవధిలో రికార్డు స్థాయిలో కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడం, మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. ఆదివారం నమోదయిన కేసుల్లో ఏపీలో ఉంటున్నవారు 961 మంది కాగా.. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చిన వారు 36 మంది, విదేశాల నుంచి వచ్చిన వారు ఒకరు ఉన్నారు. దీంతో ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 18,697కు, మృతుల సంఖ్య 232కు చేరింది.తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి నానాటికీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1590 మందికి కొవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో కేసులు సంఖ్య 23,902కు చేరుకుంది. నేడు 1,166 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. మొత్తం 10,904 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏడుగురు మృతిచెందగా మొత్తం మృతుల సంఖ్య 295కు చేరుకుంది. హైదరాబాద్ నగరంలో వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది.