భారీగా ఆక్సిమీటర్లకు, ఆక్సిజన్ కు డిమాండ్
హైద్రాబాద్,
కరోనా ఎఫెక్ట్తో ఆక్సిజన్ సిలిండర్లు, మెషిన్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. హాస్పిటల్స్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా అనేక మంది చనిపోతున్నారు. దీంతో హోం క్వారంటైన్లో ఉన్న కరోనా పేషెంట్లు ఆక్సిజన్ సిలిండర్లు, మిషన్లు రెంటుకు తీసుకుంటున్నారు. మరికొంత మంది రేటు ఎక్కువైనప్పటికీ వీటిని కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. వారం నుంచి ప్రతి రోజు వందల సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్స్ కోసం కాల్స్ వస్తున్నాయని సప్లయర్స్ చెబుతున్నారు. తెచ్చిన స్టాక్ హాట్ కేకుల్లా సేల్ అవుతోందంటున్నారు. ఆక్సిజన్ సిలిండర్స్, మెషిన్స్తోపాటు పల్స్ ఆక్సీ మీటర్స్ కూడా విపరీతంగా సేల్ అవుతున్నాయి. డాక్టర్స్ మాత్రం హోం క్వారంటైన్లో ఉన్న పేషెంట్లందరికీ సప్లిమెంటరీ ఆక్సిజన్ అవసరం లేదని, డయాబెటిక్, ఆస్తమా ఉన్న వయసు పైబడిన వారికే కావాలని చెబుతున్నారు.ఓల్డేజ్ వారు అందులోనూ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కరోనా వైరస్ కారణంగా త్వరగా చనిపోతున్నారు. ఇలాంటి కేసుల్లో ఎక్కువగా ఊపిరి అందకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంట్లో పెద్ద వాళ్లు ఉన్న వారు ఆక్సిజన్ సిలిండర్లను కొనిపెట్టుకుంటున్నారు. కరోనా టెన్షన్తో అవసరం ఉన్నా లేకపోయినా ముందు జాగ్రత్తతో చాలామంది ఆక్సిజన్ సిలిండర్స్, మెషిన్లు కొనుగోలు చేస్తున్నారు. హోం క్వారంటైన్లో ఉన్న వారు కూడా ఆక్సిజన్ మిషన్స్ ఆర్డర్ చేస్తున్నారు. కరోనా భయంతో సొంతంగా వీటిని కొంటున్న వారే ఎక్కువ మంది. నగరానికి చెందిన పలువురు డీలర్లు ఢిల్లీ, ముంబైతో పాటు ఇతర దేశాల నుంచి ఆక్సిజన్ సిలిండర్లు, మెషిన్స్, పల్స్ ఆక్సీ మీటర్లను తెప్పిస్తున్నారు. రెండువారాల క్రితం వరకు వీటిని రెంటుకు ఇచ్చేవారు. కానీ కొన్ని రోజులుగా ఎక్కువగా అమ్ముతున్నామని, రెంటుకు ఇచ్చినవి అలాగే ఉండిపోయాయని, మళ్లీ తెప్పించి అమ్ముతున్నామని చెబుతున్నారు.ఆక్సిజన్ సిలిండర్లలో 15 లిటర్స్ వరకు ఎయిర్ ఉన్నవి ఉంటాయి. పవర్తో నడిచే ఆక్సిజన్ మెషిన్స్ 5 లీటర్ల నుంచి 10 లీటర్ల వరకు ఉంటాయి. వీటిని నెలకు రూ.5 వేల చొప్పున రెంటుకు ఇస్తున్నారు. అత్యవసరమైతే రూ.5,500 నుంచి రూ.6 వేలకు రెంటుకు ఇస్తున్నామని ఓ సప్లయర్ తెలిపారు. రెంట్ పర్పస్లో గతవారం 25 నుంచి 30 వరకు సిలిండర్లు తీసుకున్నారని, ఇప్పుడు సిలిండర్లకు కొరత ఏర్పడిందని చెప్పారు. రెంట్తోపాటు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని, బ్రాండ్, డీలర్ను బట్టి రూ.45 వేల నుంచి రూ.75 వేల వరకు ధర ఉంటుందన్నారు. ప్రముఖ బ్రాండ్ సిలిండర్లు గత వారంలో 120 అమ్ముడుపోయాయని, రెంటు కంటే కొనిపెట్టుకుంటే ఎప్పటికీ ఉంటుందని కస్టమర్స్ అనుకుంటున్నారని చెప్పారు. కస్టమర్స్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత టీమ్తో వెళ్లి ఇంట్లో సెట్ చేసి ఎలా వాడాలో వివరిస్తున్నామన్నారు. ఆక్సిజన్ సిలిండర్ కంటే మెషిన్ అయితే డిస్పోజబుల్ క్యాప్ వల్ల అందరూ వాడొచ్చని చెబుతున్నారు.ఆక్సీ మీటర్ చేతి వేలికి పెట్టుకుంటే బాడీలో ఎంత ఆక్సిజన్ ఉందో చూపిస్తుంది. ఇందులో ఆక్సిజన్ లెవల్ 98, 99 శాతం ఉంటే ప్రాబ్లం లేదు. కానీ 92% ఉంటే ఆక్సిజన్ తప్పకుండా కావాలి. అందుకే చాలామంది ఆక్సీ మీటర్స్ను బల్క్గా కొంటున్నారు. ఇవి నాలుగైదు వెరైటీల్లో అందుబాటులో ఉన్నాయి. రెండు వారాల నుంచి వీటి అమ్మకాలు పెరిగాయి. ఒక్కో నెలా 30 వేల నుంచి 40 వేల ఆర్డర్స్ వస్తున్నాయని ఆక్సీమీటర్ డీలర్ శశికాంత్ మంత్రి తెలిపారు. ప్రతి రోజు 15 నుంచి 20 ఎంక్వయిరీలు వస్తున్నాయని, ఒక్కో సప్లయిర్ 300 పీసులు డెలివరీ చేస్తున్నారని చెప్పారు.ఆక్సిజన్ సిలిండర్స్, మెషిన్ల కోసం నాకు రోజూ 40కిపైగా కాల్స్ వస్తున్నాయి. కరోనాకు ముందు వీటిని రెంట్కు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు అన్నీ రెంటులోనే ఉన్నాయి. అందుకే సేల్ చేయడం మొదలు పెట్టాం. సిలిండర్ తీసుకుంటే మేమే వెళ్లి సెట్ చేసి ఎలా వాడాలో కూడా చెప్తాం. జంబో సిలిండర్ 10 గంటల నుంచి 15 గంటల వరకు ఉంటుంది. దాన్ని రీఫిల్ చేయాల్సి ఉంటుంది. గతవారం 120 సిలిండర్లు సేల్ చేసాం. స్టాక్ అయిపోవడంతో మళ్లీ తెప్పిస్తున్నామంటున్నారు నిర్వాహకులు.