విశాఖపట్నం జూలై 6,
ప్రపంచ మానవాళిని వణికిస్తున్న కరోనా మహమ్మారిపై పోరాటంలో నగర పోలీసులు అద్భుతంగా పనిచేశారని డీజీపీ గౌతమ్‌సవాంగ్ కితాబిచ్చారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో ప్రజలంతా ఇంట్లోనే ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం అరకొర సదుపాయాలతో రోడ్లపై విధులు నిర్వర్తించడం అభినందనీయ మన్నారు. లాక్‌డౌన్ సమయంలో ఆస్తి అపహరణ కేసులు గణనీయంగా తగ్గాయన్నారు. ఈ ఏడాది జూన్ వరకూ నమోదైన కేసుల సంఖ్య గత ఏడాది జూన్ వరకూ నమోదైన కేసులతో పోల్చితే ఏకంగా 41 శాతం తగ్గడం విశేషమన్నారు. రోడ్డుప్రమాదాలు కూడా సగం వరకూ తగ్గాయన్నారు. ప్రతీ ఏటా రోడ్డుప్రమాదాల కారణంగా 350 మంది వరకూ మృతి చెందుతుంటే ఈ ఏడాది జూన్ నాటికి కేవలం 72 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారన్నారు. హెల్మెట్ ధారణపై నగర పోలీసులు వాహనచోదకుల్లో అవగాహన పెంచడంతో 95 శాతం మంది హెల్మెట్ ధరిస్తున్నారన్నారు. రోడ్డు ప్రమాదాలకు గురైనవారిలో 50 శాతం మంది హెల్మెట్ ధరించి ఉండడం వల్లే ప్రాణాలు దక్కించుకున్నట్టు తమ పరిశీలనలో తేలింద ని డీజీపీ అన్నారు. నగర పోలీసుల్లో రోగనిరోధకశక్తి పెరిగేందుకు అవసరమైన మందులు, వైద్యులతో చికిత్స, కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తున్నామన్నారు.