YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

‘డ్రైశ్వాబ్‌’ను అభివృద్ధి చేసిన సీసీఎంబీ.. ప్రస్తుత విధానంతో పోలిస్తే సగమే ఖర్చు ఐదు గంటల్లోనే ఫలితం వచ్చే అవకాశం

‘డ్రైశ్వాబ్‌’ను అభివృద్ధి చేసిన సీసీఎంబీ..        ప్రస్తుత విధానంతో పోలిస్తే సగమే ఖర్చు       ఐదు గంటల్లోనే ఫలితం వచ్చే అవకాశం

హైదరాబద్ జూలై 6
దేశంలో కొవిడ్‌-19 కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. జనాభాలో ఇంకా ఎంత మంది కరోనా బాధితులు ఉన్నారో తెలుసుకోవాలంటే ఎక్కువ పరీక్షలు చేయాలి. కానీ, ప్రస్తుతం చేస్తున్న పద్ధతిలో కరోనా పరీక్షలు చేయటానికి ఎక్కువ సమయం పడుతుంది. ఫలితంగా కరోనా బాధితులకు సకాలంలో చికిత్స అందించలేని పరిస్థితి నెలకొంటోంది. దీన్ని అధిగమించేందుకు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) నడుం బిగించింది. ప్రస్తుత పరీక్ష విధానానికి ప్రత్యమ్నాయాన్ని అభివృద్ధి చేసింది. అతి తక్కువ సమయంలో.. 50శాతం ఖర్చుతో.. అంతే కచ్చితత్వంతో పరీక్షలు చేసే పద్ధతిని సీసీఎంబీ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ విధానానికి అనుమతి కోరుతూ  ఐసీఎంఆర్‌కు దరఖాస్తు చేశారు. ఈ కొత్త పద్ధతిలో ఉన్న సౌలభ్యాన్ని సీసీఎంబీ ప్రతినిధి డాక్టర్‌ సోమదత్తా ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. ‘‘కొవిడ్‌ అనుమానితుల నోరు లేదా ముక్కు నుంచి నమూనాలను ఒక పుల్ల (శ్వాబ్‌)ద్వారా సేకరిస్తారు.ఆ తర్వాత దీనిని వైరల్‌ ట్రాన్స్‌ఫర్‌ మీడియం (వీటీఎం) అనే ద్రవంలో ఉంచి పరిశోధన శాలకు పంపుతారు. ఈ పద్ధతిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మొదటి సమస్య- వీటీఎం రవాణా. నమూనాను సేకరించి దానిని ల్యాబ్‌కు తీసుకెళ్లే సమయంలో ఎంత జాగ్రత్తగా ప్యాక్‌ చేసినా వీటీఎం కొద్దిగా బయటకు చిమ్మే అవకాశం ఉంది. ఇలా రెండు ట్యూబుల్లోని వీటీఎంలు కలిస్తే ఆ నమూనాలు పనికిరావు.  ఇక రెండో సమస్య- నమూనాను విశ్లేషించే ప్రక్రియ. వీటీఎంలో నమూనాను ఉంచటం వల్ల దానిలో వైరస్‌ ఉంటే వ్యాప్తి చెందుతుంది. దీనిలో నుంచి వైరస్‌ ఆర్‌ఎన్‌ఏ ఉందా? లేదా? అనే విషయాన్ని పీసీఆర్‌ యంత్రంలో విశ్లేషించిన తర్వాత చెప్పగలుగుతాం. ఒక నమూనా ల్యాబ్‌కు వచ్చిన దగ్గర నుంచి ఫలితం రావటానికి కనీసం 15 నుంచి 18 గంటలు పడుతుంది. ఈ కారణంగా ల్యాబ్‌లలో ఎక్కువ నమూనాలను పరీక్షించలేకపోతున్నారు. ఈ రెండు సమస్యలను గమనించిన మా శాస్త్రవేత్తలు ‘డ్రై శ్వాబ్‌’ పరీక్షను అభివృద్ధి చేశారు.ఈ పద్ధతిలో ప్రత్యేకమైన పుల్ల ద్వారా నమూనాను సేకరించి.. దానిని ద్రవ పదార్థంలో కాకుండా.. నేరుగా ఒక ప్రత్యేకమైన ట్యూబ్‌లో భద్రపరిచి ల్యాబ్‌కు పంపుతారు. దీని వల్ల ఒక నమూనా మరొక నమూనాతో కలిసిపోతుందనే భయం ఉండదు. నమూనాను నేరుగా పీసీఆర్‌ మిషన్‌లో ఉంచి విశ్లేషించొచ్చు. సమయం కూడా 15 నుంచి 5 గంటలకు తగ్గిపోతుంది. దీని వల్ల ఎక్కువ నమూనాలను పరీక్షించటానికి వీలుంటుంది.   పరీక్షలు చేయడానికి అయ్యే ఖర్చు కూడా 50 శాతం తగ్గిపోతుందని మా పరిశీలనలో తేలింది. రోజూ కొన్ని వేల నమూనాలను పరీక్షించాల్సిన నేపథ్యంలో ఈ కొత్త పద్ధతి బాగా పని చేస్తుంది. మిగిలిన పద్ధతులతో పోలిస్తే - డ్రైశ్వాబ్‌ విధానంలో నమూనాలను సేకరించటానికి.. సేకరించిన వాటిని విశ్లేషించటానికి ఎక్కువ నైపుణ్యం కూడా అవసరం లేదు.అందుకే ఈ తరహా పరీక్షలకు అనుమతి ఇవ్వాలని ఐసీఎంఆర్‌ను కోరాం.  అనుమతి వచ్చిన తర్వాత ఈ తరహా పరీక్షలు చేయటం మొదలుపెడతాం. ఇక మేము చేసిన పరిశోధనల్లో మామూలు పరీక్షలకు, డ్రై శ్వాబ్‌ పరీక్షలకు మధ్య కచ్చితత్వం విషయంలో ఏ మాత్రం తేడా లేదని తేలింది. అందువల్ల ఈ పరీక్షను నిరభ్యంతరంగా చేయవచ్చు. ఇప్పటి దాకా ఏ రాష్ట్రంలోనూ ఈ తరహాలో పరీక్షలు చేయడం లేదు. ఐసీఎంఆర్‌ అనుమతిస్తే    తెలంగాణలోనే అమల్లోకి తెస్తాం’’ అని పేర్కొన్నారు.

Related Posts