సద్గురు: ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా మంది ప్రత్యేకించి యువత ఆధ్యాత్మికత పట్ల వ్యతిరేకత ఏర్పరుచుకున్నారు. ఆధ్యాత్మికతను ఒక హేయమైన పద్ధతిలో చూపించడం వల్ల ఈ అసహ్యం ఏర్పడింది. అందరూ ఆధ్యాత్మికత అంటే సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, వీధి చివర కూర్చుని భిక్షాటన చెయ్యడం అనుకుంటున్నారు. జనం ఆధ్యాత్మికత అంటే భయంకరమైన జీవితంగా, చిత్రహింసలతో కూడుకున్నదిగా అర్థం చేసుకున్నారు, ఇంకా సహజ జీవనానికి విరుద్ధంగా, జీవితాన్ని ఆనందించకుండా అన్ని విధాలా బాధ పడుతుండడం అనుకుంటున్నారు. నిజానికి,ఆధ్యాత్మికతకు మీ బయటి పరిస్థితులతో సంబంధం లేదు. మీరు పూరి గుడిసెలో నివసిస్తున్నా , రాజభవనంలో వున్నా ఆధ్యాత్మిక జీవనం గడపవచ్చు. పూరి గుడిసె లేదా రాజభవనంలో జీవించడం మీరు కోరుకొని వుండవచ్చు లేదా మీ సామాజిక ఆర్థిక నిర్బంధం అయ్యుండొచ్చు. దీనికి ఆధ్యాత్మికతకు ఎటువంటి సంబంధం లేదు. ఆధ్యాత్మికతో ఉండడం అంటే మీ ఆనందానికి మీరే మూలం అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడము. ప్రస్తుతం మీ ఆనందానికి వేరెవరో లేదా వేరేదో కారణమని మీరు నమ్ముతున్నారు. అందువల్ల మీరిప్పుడు ఇతరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నారు. అదే, మీ ఆనందానికి మీరే మూలమని అనుభవపూర్వకంగా తెలుసుకుంటే, మీరు అన్ని వేళల్లో ఆనందంగా ఉంటారు. కదా? ఇది కేవలం మీరు ఎంచుకున్నది మాత్రమే కాదు. మీలో వున్న జీవం ఆనందంగా ఉండటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తున్నది. మీ జీవితాన్ని ఒకసారి మీరు పరిశీలిస్తే, మీరు చదువుకుంటారు, మీకు డబ్బు, ఇల్లు, పిల్లలు ఇవన్నీ కావాలి ఎందుకంటే ఇవన్నీ మీకు ఆనందాన్ని ఇస్తాయని ఆశిస్తున్నారు. ఇప్పుడు మీ చుట్టూ చాలా పోగయ్యాయి కానీ మీ ఆనందం గురించి మాత్రం మర్చిపోయారు. జీవితామంటే ఏమిటో పూర్తిగా అపార్థం చేసుకున్నందువల్ల ప్రజలు బాధాకరమైన స్థితిలో ఉన్నారు."లేదు! కానీ నా భర్త, భార్య, నా అత్తగారు గురించి మీకు తెలియదు....అంటే" అవును వారందరూ వుంటారు. కానీ మీరు మీ ప్రాధాన్యత బాధలకు ఇచ్చారు, అది మీ ఎంపిక. మీరు బాధపడడం వల్ల ఏదో వస్తుందని అనుకుంటున్నారు. ఉదాహరణకి, మీ కుటుంబంలో ఎవరైనా మీకిష్టం లేనిదేదైనా చేస్తున్నారనుకుందాం. మీరు మనస్తాపం చెందుతారు, ముఖం ముడుచుకుంటారు, దాని వల్ల బాగైపోతుందని. ఏదో జరగాలని కోరుకుంటూ మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుంటారు. ఇటువంటప్పుడు మీ చేతిలో స్వర్గం వున్నా ఉపయోగమేముంది? మీరు స్వతహాగా ఆనందభరితమైన వ్యక్తి అయితే చేతిలో ఏమీ లేకపోయినా పర్వాలేదు. మీరు నిజంగా ఆనందంగా ఉండే వ్యక్తి అయితే మీ వద్ద ఏం వున్నా లేకపోయినా ఎవరు వున్నా లేకపోయినా అది మీకు ముఖ్యం కాదు. మీరు ఇతరులను ఉదారంగా చూడడం, ప్రేమించడం, ఏదైనా స్వంతం చేసుకోవాలనుకోవడం ఇవన్నీ కేవలం మీరు ఆనందంగా ఉండడం కోసమే చేస్తారు.
జనం ఎప్పుడూ నన్ను ఈ ప్రశ్న అడుగుతుంటారు. "ఆధ్యాత్మిక వ్యక్తికి, లౌకిక వ్యక్తికి తేడా ఏమిటి"? అని. నేను సరదాగా ఇలా చెప్తాను. లౌకికుడు తన ఆహారం మాత్రం సంపాదించుకుంటాడు, మిగితావన్నీ - ప్రేమ, శాంతి, ఆనందం అతను యాచించాలి. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి అన్నీ సంపాదించుకుంటాడు - అతని ప్రేమ, శాంతి, సంతోషం.. అన్నీ. ఆహారం మాత్రం యాచిస్తాడు, అతను అనుకుంటే అది కూడా సంపాదించుకోగలడు.
వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో