విజయవాడ, జూలై 7,
బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బలపడాలనుకుంటుంది. మిషన్ 2024ను ఇప్పటికే బీజేపీ ప్రారంభించినట్లు అర్థమవుతుంది. జనసేనతో పొత్తు పెట్టుకుని బీజేపీ అధికారంలోకి వచ్చే ప్రయత్నాలను ఏపీలో మొదలు పెట్టిందనే చెప్పాలి. ఇది తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కరంగా మారే అవకాశముందంటున్నారు. ఏపీలో దళిత, మైనారిటీ, రెడ్డి సామాజికవర్గం ఓట్లను ప్రస్తుతమున్న పరిస్థితుల్లో దక్కించుకోవడం కష్టమేనన్నది బీజేపీ నేతలు దాదాపు ఫిక్స్ అయ్యారు. దీంతో కాపు, కమ్మ ఓట్లపైనే బీజేపీ ఎక్కువ ఆధారపడాల్సి ఉంటుంది. జనసేన నేత పవన్ కల్యాణ్ అండతో కాపు సామాజికవర్గం ఓట్లను రాబట్టుకునే వీలుంటుందన్న అంచనాలో ఉన్నారు. గత ఎన్నికల్లో కాపు సామాజికవర్గం ఓట్లు వైసీపీకి షిఫ్ట్ అయ్యాయి. జనసేనకు కొంత శాతం ఓట్లు వచ్చినా అనుకున్న స్థాయిలో రాలేదు. అందుకే కాపు రిజర్వేషన్లపై పవన్ ను వెంబడడపడాల్సిందిగా బీజేపీ నేతలు డైరెక్షన్ ఉందంటున్నారు.ఇక కమ్మ సామాజికవర్గం ఓట్లు కూడా ముఖ్యమని బీజేపీ భావిస్తుంది. కమ్మ సామాజికవర్గం తెలుగుదేశం వైపే ఉంది. జగన్ ఏడాది పాలన తర్వాత ఆ సామాజిక వర్గం ఓటర్లు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై నమ్మకం లేదు. చంద్రబాబు ఎంత కష్టపడుతున్నా వచ్చే ఎన్నికల నాటికి బలోపేతం కాలేరన్నది ఆ సామాజికవర్గం నేతలే చెబుతున్నారు. దీంతో కేంద్రంలో బలంగా ఉన్న బీజేపీ వైపు కమ్మ సామాజికవర్గం ఓట్లు మళ్లేలా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయంటున్నారు.
రానున్న కాలంలో కమ్మ సామాజికవర్గం నేతలకు బీజేపీలో ప్రాధాన్యత పెరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీజేపీలో కొందరు కమ్మ సామాజికవవర్గం నేతలు ఉన్నారు. మరింత మందిని చేర్చుకోవాలన్నది బీజేపీ ఆలోచనగా ఉంది. ఆర్థికంగా బలంగా ఉన్న వారిని కూడా కండువా కప్పేందుకు సిద్ధమయింది. నియోజకవర్గాల వారీగా టీడీపీ నేతలను ఎంపిక చేసుకుని పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ రంగం సిద్ధం చేసిందంటున్నారు. మొత్తం మీద బీజేపీ ఏపీలో దూకుడు పెంచితే ముందుగా ఇబ్బంది పడేది తెలుగుదేశం పార్టీ మాత్రమే