గుంటూరు, జూలై 7,
వారిద్దరూ వైసీపీ తరఫున గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. ఉన్నత చదువులు చదివినా… ఉన్నతమైన స్థానాల్లోనే ఉన్నప్పటికీ..రాజకీయాల్లోకి అడుగులు వేశారు. వాటిని వదులుకుని ప్రజల పక్షాన నిలిచేందుకు దాదాపు రెండేళ్లు కష్టపడ్డారు. వైసీపీ అధినేత జగన్ అడుగు జాడల్లో నడిచారు. టీడీపీ కంచుకోటలను బద్దలు కొట్టి మరీ ఎంపీలుగా విజయం సాధించారు. వారే.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్, గుంటూరు జిల్లా నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు. ఇద్దరూ కూడా యువకులు ఉత్సాహవంతులు.. ఉన్నత విద్య చదివి.. ఉన్నతస్థాయిలో ఉన్నవారే. ప్రజలకు ప్రత్యక్ష సేవ చేయాలనే లక్ష్యంతో వారు రాజకీయాల్లోకి వచ్చారు.రాజమండ్రి నుంచి విజయం సాధించిన మార్గాని భరత్ ఉన్నత విద్యను అభ్యసించారు. సినీ రంగంలోకి ప్రవేశించి హీరోగా కూడా నటించారు. తర్వాత రాజకీయ బాటపట్టారు. టీడీపీలో ఉన్నా ఎదుగు బొదుగు లేకపోవడంతో పాటు ఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో వైసీపీలోకి జంప్ చేశారు. జగన్ పిలిచి మరీ ఎంపీ సీటు ఇచ్చారు. తొలి ప్రయత్నంలోనే భరత్ విజయం దక్కించుకున్నారు. అయితే, ఈయన స్థానికంగా ఉన్న వైసీపీ నేతలతో కలిసిమెలిసి పనిచేయలేక పోతున్నారు. అతి పెద్ద జిల్లా అయిన తూర్పులో వైసీపీకి బలమైన నాయకులు ఉన్నారు. మంత్రులు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారితో కలిసి పార్టీకి, ప్రజలకు పని చేయాలని ఉన్నప్పటికీ.. భరత్‌ను ఇక్కడి వారు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదు.పైగా ఇసుక సహా ఆవ భూముల వ్యవహారం విషయంలో ఆరోపణలు వచ్చాయి. దీంతో జగన్ భరత్‌పై అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇక తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలకు భరత్‌కు మధ్య పొసగడం లేదన్న టాక్ స్థానికంగా వినిపిస్తోంది. ఓ యువ ఎమ్మెల్యే భరత్ తీరుపై నేరుగా జగన్‌కే ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇక, అదేసమయంలో ఆయా విషయాలపై జగన్‌తో భేటీ అయి చర్చించాలని భరత్ అనుకున్నారు. అయి తే, జగన్ అప్పాయింట్‌మెంట్ ఇవ్వలేదట. దీంతో భరత్ కూడా సీఎంపై అసహనంతో ఉన్నారనే ప్రచారం వైసీపీలో సాగుతోంది. ఇదీ.. భరత్ పరిస్తితి.ఇక, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు పరిస్థితిని గమనిస్తే.. ఈయన కూడా యువ నేత. ఎంతో కష్టపడి విజయం సాధించారు. అయితే, ఈయన పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతో ఈయనకు పడడం లేదనే ప్రచారం జరుగుతోంది. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీతో పూర్తి వైరం కొనసాగుతోంది. పోనీ.. మంత్రులు ఎవరైనా పట్టిం చుకుంటున్నారా? అంటే అదీలేదు. ఒక సామాజిక వర్గానికి చెందని ఎమ్మెల్యేలతో ఆయనకు కోల్డ్ వార్ నడుస్తోందట. దీంతో ఆయన సొంతగానే గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదీ ఈ యువ ఎంపీల పరిస్థితి..!