హైద్రాబాద్, జూలై 7,
ఏదైనా విపత్తు సంభవించిన వేళ ప్రచారాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తాయి. అటువంటిది ఏకంగా ప్రభుత్వవర్గాల నుంచి ఇటువంటి ప్రచారం మొదలైతే ప్రజలు మరింత భయాందోళనలకు గురవుతారు. ఇప్పుడు హైదరాబాద్‌లో జీవిస్తున్న పేదల పరిస్థితి అదే. హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ పెట్టే అవకాశం ఉంది అని ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక ప్రకటన ఉధృతంగా ప్రచారమయ్యిందిఇప్పటికే మూడు నెలల పాటు లాక్‌డౌన్ కారణంగా చేసుకునేందుకు పనులు లేక ఇబ్బంది పడ్డ పేదలను మరోసారి లాక్‌డౌన్ అనేక ప్రకటన కలవరపాటుకు గురి చేసింది. మళ్లీ లాక్‌డౌన్ విధిస్తే హైదరాబాద్‌లో బతకలేం అనే భయాన్ని కలిపించింది. దీంతో బతుకు జీవుడా అంటూ రాజధానిలోని పేదలు పల్లె బాట పడుతున్నారు.పల్లెల్లో సాగు చేసుకునేందుకు భూములు లేక కొందరు, భూములు ఉన్నా కరువు కారణంగా మరికొందరు ఉపాధి కోసం పట్టణాల బాట పడతారు. అనేక ఏళ్లుగా పల్లెల నుంచి పట్టణాలకు వలసలు కొనసాగుతున్నాయి. కానీ, కరోనా వైరస్ మాత్రం ఈ పరిస్థితిని, పేదల జీవితాలను రివర్స్ చేసింది. పట్టణాల నుంచి పల్లెలకు తిరిగి వలసలు వెళ్లే పరిస్థితి కల్పించింది.ఫలితంగా రాజధాని హైదరాబాద్ నగరం ఖాళీ అవుతుంది. పేదలు తమకు ఎలా అవకాశం ఉంటే అలా నగరంలో ఇళ్లు ఖాళీ చేసి స్వగ్రామాలకు వలస వెళ్లిపోతున్నారు. ఇందుకు ప్రభుత్వం మళ్లీ లాక్‌డౌన్ పెడతామని చేసిన ప్రకటన మరింత కారణమైంది.నగరంలో ఖర్చులు ఎక్కువ. పేదలు ఆలూమగలు రోజంతా కష్టపడితే కానీ అద్దెలు కట్టి బతకలేని పరిస్థితి. రెక్కాడితే కానీ డొక్కాడదు అనే సామెత వీరికి సరిగ్గా సరిపోతుంది. ఏదో కష్టం చేసుకొని జీవనం సాగించే వారి జీవితాలను కరోనా మహమ్మారి తలక్రిందులు చేసింది. లాక్‌డౌన్ కారణంగా పనులు లేక వీరంతా మూడు నెలల పాటు ఇబ్బందులు పడ్డారు. పోగు చేసుకున్న కొంత సొమ్ము కూడా ఖర్చయిపోయింది. కొందరు స్వగ్రామాలకు వెళ్లిపోయారు. చాలామంది నగరంలోనే ఉండిపోయారు. ఇప్పుడు అన్‌లాక్ ప్రక్రియ మొదలుకావడంతో వీరిలో మళ్లీ బతుకుదెరువుపై ఆశలు చిగురించాయి. పనులు దొరుకుతాయని ఎదురు చూస్తున్నారు. ఇటువంటి సమయంలో హైదరాబాద్‌లో కరోనా విజృంభణ మొదలైంది.నగరంలో తక్కువ టెస్టులే చేస్తున్న కేసులు పెద్ద ఎత్తున భయటపడుతున్నాయి. ప్రతి రోజూ వెయ్యికి పైగా కరోనా కేసులు నగరంలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజధానిలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి మరోసారి లాక్‌డౌన్ విధించాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మళ్లీ నగరంలో 15 రోజుల పాటు లాక్‌డౌన్ పెట్టాలని వైద్యారోగ్య శాఖ నుంచి ప్రతిపాదనలు వస్తున్నట్లు జూన్ 28న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నట్లు వార్తలు వచ్చాయి. రెండుమూడు రోజుల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఈ వార్త దావానళం వ్యాపించింది. మళ్లీ లాక్‌డౌన్ పెడతారనే భావన నగరవాసుల్లో వ్యక్తమైంది.దీంతో హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ పెడితే తాము బతకడం కష్టమనే భయం నగరంలోని పేదల్లో నెలకొంది. ఇక్కడ ఉండి ఇబ్బందులు పడే కంటే స్వంత గ్రామాలకు వెళ్లి కలో గంజో తాగి బతకాలనే అనుకున్నారు. దీంతో సొంతూళ్లకు బాట పట్టారు. పెద్ద ఎత్తున నగరం నుంచి గ్రామాలకు వెళ్లిపోయారు. ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వచ్చిన తెల్లారి నుంచి బస్సులు రద్దీగా మారిపోయాయి. చాలా మంది ఆటోలు, ఇతర వాహనాలు కట్టుకొని సామాన్లను సైతం ఖాళీ చేసి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఇంకా వెళ్లిపోతున్నారు. దీంతో నగరంలో ఏ గల్లీలో చేసినా టూలెట్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.అయితే, పేదలు ఇలా ప్రభుత్వం పెట్టిన లాక్‌డౌన్ భయంతో స్వగ్రామాలకు వెళ్లిపోతుంటే ప్రభుత్వం మాత్రం సైలెంట్‌గా మారిపోయింది. రెండుమూడు రోజుల్లో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పది రోజులైనా నిర్ణయం తీసుకోలేదు. కనీసం లాక్‌డౌన్ ఉంటుందా, ఉండదా అనే విషయం కూడా చెప్పడం లేదు. లాక్‌డౌన్ భయంతో ఊర్లకు వెళ్లిపోతున్న పేదలకు కనీసం ధైర్యం చెప్పే పరిస్థితి కూడా లేదు. మొదటిసారి లాక్‌డౌన్ పెట్టినప్పుడు ఇతర రాష్ట్రాల వలస కూలీలు వారి స్వంత ప్రాంతాలకు వెళ్లిపోయారు.ఇప్పుడు లాక్‌డౌన్ భయంతో రాష్ట్రానికే చెందిన నగరంలో నివసిస్తున్న పేదలు స్వగ్రామాలకు వెళుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా లాక్‌డౌన్‌పై ఏదో ఒక ప్రకటన చేయకపోతే పేదలు మరింత ఇబ్బంది పడతారు. కరోనా మొదలైన కొత్తలో, కేసులు తక్కువగా ఉన్నప్పుడు వారానికి ఒకసారి మీడియా ముందుకు వచ్చి ప్రెస్‌మీట్లు పెట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు మీడియా ముందుకే రావడం లేదు. ఇక, మంత్రులు లాక్‌డౌన్‌పై ఎవరికి నచ్చిన స్టేట్‌మెంట్లు వారు ఇస్తూ ప్రజలను మరింత గందరగోళానికి గురి చేస్తున్నారు