YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌లలో రాత్రి భారీ వర్షాలు

Highlights

  • తాజ్‌ మహల్‌ ప్రవేశ ద్వారం వద్ద కుప్పకూలిపోయిన పిల్లర్‌
ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌లలో రాత్రి భారీ వర్షాలు

న్యూదిల్లీ : ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌లలో రాత్రి భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈ వర్షం ప్రభావంతో ఉత్తరప్రదేశ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడమైన తాజ్‌ మహల్‌ ప్రవేశ ద్వారం వద్ద ఓ పిల్లర్‌ కుప్పకూలిపోయింది. ‘దర్వాజా-ఈ-రౌజా’గా పిలిచే దక్షిణం వైపు గేటుకు సంబంధించిన 12 అడుగుల మెటల్‌ పిల్లర్‌ పడిపోయింది. 40 నిమిషాల పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్ష ప్రభావం తాజ్‌మహల్‌పైనా పడిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తాజ్‌ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా ఉత్తరప్రదేశ్‌లో 15 మంది ప్రాణాలు కోల్పోగా, రాజస్థాన్‌లో 16 మంది చనిపోయారు. దాదాపు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని సమాచారం. బుధవారం నాటి భారీ వర్షం కారణంగా ఉత్తరప్రదేశ్‌లోని బ్రజ్‌ ప్రాంతంలో 15 మంది చనిపోయారు. మరో 24 మంది గాయపడ్డారు. జౌన్‌పూర్‌ షాగంజ్‌లోని మసీదు పిల్లరు కూడా కూలిపోయింది. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకూ 35 మంది చనిపోగా, 80శాతం పంటలు నష్టపోయాయని అధికారులు వెల్లడించారు. బాధిత ప్రజలకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.రాజస్థాన్‌లో కూడా నిన్న భారీ వర్షం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల రాష్ట్రంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. భరత్‌పూర్‌ ప్రాంతంలో అయిదుగురు చనిపోయారు. ధోల్‌పూర్‌ జిల్లాలో 11 మంది చనిపోగా అందులో అయిదుగురు చిన్నారులు ఉన్నారు. దాదాపు వంద మంది గాయాలపాలయ్యారు. వేలాది చెట్లు నేలకూలాయని, ఫోన్‌ లైన్లు పాడైపోయాయని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, వర్ష ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి సమాచారం సేకరిస్తున్నామని చెప్పారు. ఇళ్లు కూలిపోవడంవల్లే చాలా మంది మరణించారని వెల్లడించారు.

Related Posts