హైద్రాబాద్, జూలై 7,
హైదరాబాద్‌లో అన్యాక్రాంతమవుతున్న పార్కులు, చెరువులు, బహిరంగ స్థలాలను కాపాడుకునేందుకు ప్రభుత్వం మరో కార్యక్రమాన్ని చేపట్టింది. ఫిర్యాదుల స్వీకరణకు అస్సెట్ ప్రొటెక్షన్ సెల్ ను ఏర్పాటు చేయనుంది. ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేసినా, ఇతరత్రా కార్యక్రమాలు చేపట్టినా అధికారులకు తెలిపేలా ఒక టోల్ ఫ్రీ నెంబర్‌ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్.జీహెచ్ఎంసీ పరిధిలో కబ్జా రాయుళ్ల ఆటకట్టించేందుకు ప్రభుత్వం అస్సెట్ ప్రొటెక్షన్ సెల్‌ను ఏర్పాటు చేసింది. కబ్జాలపై ఫిర్యాదులు తీసుకునేందుకు 1800-599-0099 టోల్ ప్రీ నెంబర్ ని ఏర్పాటు చేసింది. మంత్రి కేటీఆర్ టోల్ ఫ్రీ నెంబర్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని నగరంలోని చెరువులు, పార్కులు, బహిరంగ స్థలాల రక్షణకు ప్రభుత్వానికి సమాచారమివ్వాలని మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు.ఎవరైనా పౌరులు కబ్జాలపై సమాచారం అందిస్తే ఒక ప్రత్యేకమైన ఫిర్యాదుగా నమోదు అవుతుంది. ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేకంగా విశిష్ట సంఖ్యను కేటాయిస్తారు. ఈ సంఖ్య ద్వారా భవిష్యత్తులో తన ఫిర్యాదు పురోగతిని పౌరులు తెలుసుకునే వీలుంటుంది. ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే అసిస్టెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారికి సమాచారం వెళుతుంది. ఆయన ఫిర్యాదుపై వెంటనే విచారణ మొదలుపెడతారు.కబ్జాకు పాల్పడేవాళ్లలో రాజకీయ నేతలు, క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లు ఉండటంతో ఫిర్యాదుదారుడికి రక్షణ కల్పించే చర్యలను కూడా తీసుకుంది ప్రభుత్వం. ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి వివరాలు బయటకు రాకుండా గోప్యంగా ఉంచే వెసులుబాటును కూడా కల్పించింది.కబ్జాలపై అందే ఫిర్యాదులను పరిష్కరించడానికి జీహెచ్‌ఎంసీ పరిధిలోని జోన్లు, సర్కిళ్లలో ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించారు. పార్కులు, చెరువులు, బహిరంగ ప్రదేశాల అస్సెట్ ప్రొటెక్షన్ సెల్ అన్ని పనిదినాల్లోనూ పనిచేస్తుంది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇది పనిచేయనుంది. రోజురోజుకు హైదరాబాద్ నగరంలో ల్యాండ్స్ రేట్ భారీగా పెరిగిపోతుండడంతో.. ప్రభుత్వం భూములు కబ్జాలకు గురవుతున్నాయి. ఇక ప్రత్యేక విభాగం ఆస్తుల పరిరక్షణపై ఫోకస్ చేస్తే.. ఆక్రమణలకు అడ్డుకట్టపడే అవకాశముంది.