న్యూ ఢిల్లీ జూలై 7
వైరస్ కు మందు రెండు నెలల్లో వస్తుందని ప్రపంచమంతా కొంత ఆశాభావంలో ఉండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటన అందరినీ ఆందోళన లో పడేసింది. వైరస్ నివారణకు ఇప్పట్లో మందు రాదని సంలచన ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్నాయని.. అయితే వీటి లో ఏ ఒక్కటి కూడా 2021 కంటే ముందు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ప్రకటించారు. వైరస్ ను సమర్థ వంతం గా ఎదుర్కొనే ఏ వ్యాక్సిన్ను అభివృద్ధి చేయాలంటే మూడు దశల్లో ప్రయోగాలు చేయాల్సి ఉందని తెలిపారు. తొలి రెండు దశల్లో ప్రాథమిక పరీక్షలు మాత్రమే నిర్వహిస్తారని.. వ్యాక్సిన్ పని తీరును పూర్తి స్థాయిలో పరీక్షించే మూడో దశే అత్యంత కీలకం కఠినమైనదని వివరించారు. ప్రస్తుతం యూకే లోని ఆక్స్ఫర్డ్ విశ్వ విద్యాలయ తయారు చేసిన వ్యాక్సిన్ మాత్రమే క్లినికల్ ట్రయల్స్ ఫేజ్-3 లో ఉందని తెలిపారు. వైరస్ నివారణకు సిద్ధం చేస్తున్న వ్యాక్సిన్లు ప్రయోగ దశలో ఉన్న వాటిని వాటి అభివృద్ధి తీరును డబ్ల్యూహెచ్ఓ నిపుణుల కమిటీ పర్యవేక్షిస్తోందని పేర్కొన్నారు. ప్రస్తుతం వైరస్ బాధితులకు అందిస్తున్న రెమెడిసివిర్ ఫావిపిరవిర్ మందులు సరైనవి కాదని తెలిపారు. ఈ క్రమంలోనే ఆగష్టు 15వ తేదీ వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటనపై ఆమె స్పందించారు. ట్రయల్స్ నిర్వహించడానికి చాలా సమయం పడుతుందని అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన తర్వాతే వ్యాక్సిన్ను ఉపయోగించే అవకాశం ఉందని వివరించారు. వ్యాక్సిన్ ట్రయల్స్ పూర్తికావడానికి కనీసం 6 నుంచి 9 నెలల సమయం పడుతుందని స్పష్టం చేశారు. ఆమె మాటలను చూస్తే భారత్లో కూడా 2021లోనే వైరస్కు మందు వచ్చే అవకాశం ఉంది.