న్యూ ఢిల్లీ జూలై 7
తమ దేశంలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు అమెరికా షాకిచ్చింది. కరోనా వైరస్ వల్ల ఇప్పుడు కొన్ని విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ క్లాసులు మొదలయ్యాయి. ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభమైన విద్యార్థులు తమ దేశంలో ఉండాల్సిన పనిలేదని అమెరికా పేర్కొన్నది. ఎఫ్1, ఎం1 విద్యార్థులకు మాత్రం వెసలుబాటు కల్పిస్తున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ శాఖ వెల్లడించింది. ఆన్‌లైన్ చదువుల కోసం రిజిస్టర్ చేసుకున్న వారు దేశం విడిచి వెళ్లవచ్చు అంటూ ఐసీఈ పేర్కొన్నది. ఒకవేళ అలాంటి విద్యార్థులు దేశంలోనే ఉంటే.. వారు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది. ఆన్‌లైన్ చదువుల కోసం రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులకు వీసాలు ఇవ్వమని, అలాంటి విద్యార్థులను యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ పర్మిట్ దేశంలోకి రానివ్వదని ఐసీఈ తన ప్రకటనలో స్పష్టం చేసింది. ఎఫ్-1 వీసా విద్యార్థులు అకాడమిక్ కోర్సును, ఎం-1 వీసా విద్యార్థులు వొకేషనల్ కోర్సులను చదువుకోవచ్చు అని ఐసీఈ వెల్లడించింది. సుమారు 11 లక్షల మంది విదేశీ విద్యార్థులకు అమెరికాలో యాక్టివ్ స్టూడెంట్ వీసాలు ఉన్నాయి.