తిరుమల, ,జూలై 07
టిటిడి కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు వ్యాధి కారక క్రిముల నుండి ఎలాంటి హాని కలుగకుండా నిర్మూలించేందుకు ట్రై ఓజోన్ స్ప్రేయింగ్ సిస్టమ్‌ను మంగళవారం ఉదయం స్వామివారి ఆలయంలోనికి ప్రవేశించే రెండు మార్గాలలో ఏర్పాటు చేశారు.
శ్రీవారి ఆలయ మహాద్వారం ముందు భక్తులు ప్రవేశించే స్కానింగ్ సెంటర్ వద్ద, విధి నిర్వహణలో ఉన్న అర్చకులు, ఉద్యోగులు ప్రవేశించే బయో మెట్రిక్ వద్ద ట్రై ఓజోన్ పొగమంచు రూపంలో స్ప్రేయింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులోని హైడ్రాక్సిల్ ఫ్రి ర్యాడికల్ ఐయాన్ స్ప్రెయింగ్ చేయడం వలన వ్యాధికారక సూక్ష్మక్రిములు నశిస్తాయి. తద్వారా భక్తులు, ఉద్యోగులు, అర్చకులు ఆనారోగ్య కారక క్రిముల నుండి ఉపశమనం పొందవచ్చు.
టిటిడి ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు విస్తృత చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దర్శనానికి విచ్చేసే భక్తులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, చేతులు శుభ్రం చేసుకుని, బౌతిక దూరం పాటిస్తూ నిర్ణీత సంఖ్యలో శ్రీవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసింది. అలిపిరి వద్ద భక్తులకు, ఉద్యోగస్తులకు థర్మల్ స్కానింగ్, కరోనా పరీక్షలకు శాంపుల్స్ తీసుకుంటున్నారు. టిటిడి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో నిర్ణీత సమయంలో క్యూలైన్లు, ఆలయంలోని అన్ని ఉపరితలాల్లో సేంద్రీయ సూక్ష్మ క్రిమి నిర్మూలన కారకాలతో నిరంతరం శుభ్రం చేస్తున్నారు. అదేవిధంగా తిరుమలలోని ప్రధాన కూడళ్లలో, రద్ధీ ప్రాంతాలలో, వసతి సముదాయాలు, విశ్రాంతి భవనాలు, కల్యాణకట్ట, అన్న ప్రసాద భవనం వద్ద ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నారు.