తిరుపతి, జూలై 07
అప్పలాయగుంట శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం పుష్పయాగం జరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ పాల్గొన్నారు.
జూన్ 2 నుండి 10వ తేదీ వరకు ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహించారు.
ఇందులోభాగంగా ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారికి స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదికపై శ్రీ పద్మావతి, శ్రీ ఆండాళ్ సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారిని కొలువుతీర్చారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ పుష్పయాగం జరిగింది. తులసి, చామంతి, మొగలి, సంపంగి, రోజా, కలువ వంటి పుష్పాలు, పలురకాల పత్రాలతో పుష్పయాగం నిర్వహించారు.